బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 23, 2020 , 01:36:15

లక్ష మొక్కలే లక్ష్యం !

లక్ష మొక్కలే లక్ష్యం !

  • మణుగూరుకు ఆకుపచ్చహారం..!
  • హరితహారం మొక్కల  సంరక్షణకు ప్రత్యేక చర్యలు
  • ప్రతి ఇంటికీ మొక్కల పంపిణీ
  • పట్టణమంతా పచ్చదనం కనిపించేలా కసరత్తు


మణుగూరు : గ్రీన్‌ మణుగూరు లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో అడుగులు వేస్తున్నారు అధికారులు. మణుగూరును ఆకుపచ్చని పట్టణంగా మార్చుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత ‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా మణుగూరు మున్సిపాలిటీలో భారీ సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. ప్రతి ఇంటికీ మొక్కలను పంపిణీ చేస్తూ.. మున్సిపాలిటీలో హరితహారాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో మణుగూరు మున్సిపల్‌ అధికారులు పనిచేస్తున్నారు. పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.వెంకటస్వామి ఆయా వార్డుల వారిగా అధికారులకు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. మొక్కల సంరక్షణకూ ప్రత్యేక చర్యలు తీసుకుంటూ.. ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు గ్రీన్‌ మణుగూరు లక్ష్యంగా పనిచేస్తున్నారు. 

ప్రతి ఇంటికీ ఏడు మొక్కలు..

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మొక్కలు పంపిణీ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అధికారులు. ప్రతి ఇంటికీ 7 మొక్కల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది లక్ష్యంలో భాగంగా అన్ని వార్డులు, రహదారులు, స్కూల్స్‌, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో 55 వేల మొక్కలు నాటుతున్నారు. పట్టణ ప్రజలకు 45 వేల మొక్కలను పంపిణీ చేస్తూ.. లక్ష మొక్కల లక్ష్యానికి చేరువలో ఉన్నారు.  

ప్రత్యేక నర్సరీ ఏర్పాటు..


మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేకంగా నర్సరీ ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో 45 వేల మొక్కలు ఉన్నాయి. మరో 55 వేల మొక్కలు అటవీశాఖ వద్ద, కడియం నుంచి తీసుకొచ్చాం. ప్రతి ఇంటికీ మొక్కలు అందజేస్తున్నాం. పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో నాటుతున్నాం. నాటిన మొక్కల సంరక్షణ కోసం ట్రీగార్డులు ఏర్పాటు చేసి, స్థానికులకు వాటి బాధ్యతలు అప్పగిస్తున్నాం.

- ఎన్‌.వెంకటస్వామి, మణుగూరు మున్సిపల్‌ కమిషనర్‌

పచ్చదనంతో నిండిపోవాలి.. 


మణుగూరు పట్టణం పచ్చదనంతో నిండిపోయేలా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మణుగూరు పట్టణంలోని రోడ్లపైన, అన్ని వార్డుల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటుతున్నారు. పట్టణం ప్రజలతో పాటు విద్యాసంస్థలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, పలు అసోషియేషన్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గ్రీన్‌ మణుగూరే మా లక్ష్యం.

- రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే  రేగా కాంతారావు