గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 23, 2020 , 01:25:34

దేశానికే ఆదర్శం తెలంగాణ

దేశానికే  ఆదర్శం తెలంగాణ

  • గన్‌పౌండ్రీ తరహాలో కొత్తగూడెంలో అమరుల స్తూపం
  • ఏజెన్సీ ప్రాంతమైన ‘భద్రాద్రి’కి  కరోనా పరీక్షా కేంద్రాన్ని తెచ్చాం
  • లక్షణాలుంటే నిర్భయంగా  పరీక్షలు చేయించుకోండి
  • రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • కొత్తగూడెంలో అమరుల స్తూపం నిర్మాణానికి శంకుస్థాపన
  • ప్రధాన వైద్యశాలలో వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం

తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ తక్కువ సమయంలోనే దేశానికే ఆదర్శంగా నిలిపారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రగతి మైదానంలో నిర్మించతలపెట్టిన తెలంగాణ అమరవీరుల స్తూప నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రూ. 20లక్షలతో స్తూపాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం జిల్లాకు కరోనా పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేయించామన్నారు. అనంతరం కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు. ల్యాబ్‌లో  పరికరాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 

 - భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ 


భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. తక్కువ సమయంలోనే దేశానికే ఆదర్శంగానిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన తొలుత ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైరాలాజీ ల్యాబ్‌ (కరోనా పరీక్ష కేంద్రం)ను ప్రారంభించారు. అనంతరం మున్సిపల్‌ స్టేడియం ప్రగతి మైదానంలో తెలంగాణ అమరవీరుల స్మృత్యర్థం చేపట్టిన స్తూప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడే ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ అమరవీరుల స్తూపాన్ని నిర్మించుకోవడం సంతోషదాయకమని అన్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. 2014 ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు, సింగరేణి కార్మికులు టీఆర్‌ఎస్‌ పక్షాన నిలిచారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూనవరం మండల కేంద్రంగా సీపీఐ రాష్ట్ర బాధ్యుడు, తన తండ్రి అయిన పువ్వాడ నాగేశ్వరరావు ప్రత్యేక తెలంగాణ కోసం గళమెత్తారని, అందుకు తాను గర్విస్తున్నానని అన్నారు. అనాడు టీఆర్‌ఎస్‌కు అండదండగా ఉన్న పార్టీలు సీపీఐ, న్యూడెమోక్రసీ మాత్రమేనని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించాకే తెలంగాణాలో అడుగు పెడతానని ఇద్దరు ఎంపీలతో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ 100 రోజుల పాటు అక్కడే ఉండి అనేక పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేశారని గుర్తుచేశారు. అహింసా విధానంతో తెలంగాణను సాధించిన గొప్ప రాజనీతిజ్ఞనుడు సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని గన్‌పౌండ్రీలో ఉన్న అమరవీరుల స్తూపం నమూనాతో ఇక్కడి స్తూపాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. స్తూప నిర్మాణానికి పూనుకున్న ఎమ్మెల్యే వనమా, కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సీతాలక్ష్మిలను మంత్రి అభినందించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ దామోదర్‌లతోపాటు పాత ఉద్యమకారులతో ఉద్యమకారుల సలహా కమిటీని నియమించాలని కలెక్టర్‌కు సూచించారు. ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం జిల్లాకు కరోనా పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేయించామన్నారు. ట్రూనాట్‌, సీవీనాట్‌ పరికరాలను తెచ్చి వైరాలజీ ల్యాబ్‌లో ఉంచామన్నారు. ఖమ్మం జిల్లాలోని కొవిడ్‌ నమూనాలు సైతం ఇక్కడికే తెచ్చి పరీక్షలు చేయిస్తున్నామన్నారు. కరోనాను దృఢసంకల్పంతో ఎదుర్కొవాలన్నారు. వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రిగా ఉండి కూడా ఖమ్మంలో కాకుండా కొత్తగూడెంలో కొవిడ్‌ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారని కొందరు అంటున్నారని, కొత్తగూడెం కూడా తన ఉమ్మడి జిల్లా భాగమే కదా అని అన్నారు. రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల్లో కొవిడ్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఖమ్మంలో సైతం అధునాతన పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.

రూ.20 లక్షలతో స్తూప నిర్మాణం: ఎమ్మెల్యే వనమా

తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ సుమారు రూ.20 లక్షలతో స్తూపాన్ని నిర్మించుకోవడం చాలా ఆనందంగా ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌ అన్నారు. అప్పడు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నా ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడానన్నారు. వేరే పార్టీలో ఉన్నా సీఎం కేసీఆర్‌తో కలిసి ఉద్యమంలో నడిచానన్నారు. పాల్వంచ నవభారత్‌ ఎదురుగా కేసీఆర్‌ పేరుతో కూడా కాలనీని ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు వనమా రాఘవేందర్‌రావు, తొగరు రాజశేఖర్‌, మోరె భాస్కర్‌, వార్డు కౌన్సిలర్లు వేముల ప్రశాంత్‌బాబు, వేణుగోపాల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సత్యనారాయణసింగ్‌, యూసుఫ్‌, బండి రాజుగౌడ్‌, హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

వైరాలజీ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి


కొత్తగూడెం: జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్యలతో కలిసి రిబ్బన్‌ కట్‌ చేశారు. ల్యాబ్‌లో ఏర్పాటుచేసిన పరికరాల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి  పాల్గొన్నారు.