గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 20, 2020 , 05:02:00

లాభదాయకంగా కార్గో సేవలు

లాభదాయకంగా కార్గో సేవలు

  • టీఎస్‌ఆర్టీసీకి కలిసి వస్తున్న పార్సిల్‌, కొరియర్‌ విభాగాలు
  • డివిజన్‌లో నెలరోజుల్లో రూ.3 లక్షలకు పైగా ఆదాయం

     కొత్తగూడెం అర్బన్‌: ఆదాయాలను పెంచుకునే మార్గాలపై ఆర్టీసీ సంస్థ దృష్టి సారించింది. అందులో భాగంగా ఆర్టీసీకి చెందిన విలువైన స్థలాలను గుర్తించి అక్కడ సంస్థకు ఉపయోగపడే వ్యాపారాలను చేపడుతోంది. అవసరమైన చోట పెట్రోల్‌ బంకులను కూడా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతోపాటుగా ఇటీవల కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సర్వీసులను కూడా సంస్థ ప్రారంభించింది. గత నెల జూన్‌ 19న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోలతో ఈ సర్వీస్‌కు అంకురార్పణ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివిజనల్‌ పరిధిలో కొత్తగూడెం, మణగూరు, భద్రాచలం డిపోల్లో తొలి విడతగా పార్సిల్‌, కొరియర్‌ సరీసులను మాత్రమే ప్రారంభించి కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. 

నెలరోజుల్లో రూ.3 లక్షల ఆదాయం

జిల్లాలో ప్రారంభించిన సర్వీసులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. తొలి రోజు పదివేలకు పైగా ఆదాయం రాగా మిగతా రోజుల్లో సైతం ఇదే విధమైన ఆదాయాన్ని సమకూర్చుకోగలిగింది. దీంతో గడిచిన నెల రోజుల్లో రూ.3 లక్షలకు పైగా ఆదాయాన్ని రాబట్టుకుంది. కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలంతోపాటు ఇటీవల పాల్వంచ, సారపాక, ఇల్లెందు, అశ్వాపురం, బూర్గంపాడులలో కూడా ఏజెంట్లను నియమించుకొని కార్యకలాపాలను కొనసాగించుకునేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

సేవలు ప్రారంభిస్తే మరింత ఆదాయం.. 

ప్రస్తుతం కొరియర్‌, పార్సిల్‌ సేవలకు భద్రాద్రి ఆర్టీసీ పరిమితమైంది. కార్గో సేవలు ప్రారంభించి, ఇరు రాష్ర్టాలకు బస్సులను నడిపితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివిజన్‌కు ప్రతి రోజూ రూ.లక్షకుపైగానే ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. భద్రాద్రి జిల్లాకు చాలా వస్తువులు విజయవాడ నుంచే దిగుమతి అవుతున్నాయి. ఇటీవల ఈ సేవల గురించి అధికారులు వ్యాపారులతో  చర్చించా రు. విజయవాడకు సర్వీస్‌ ప్రారంభిస్తే ఎక్కువ ఆ దాయం పొందేందుకు అవకాశం ఉందనే అభిప్రాయాలు ఎక్కువగాఎక్కువగా వ్యక్తమయ్యాయి.