గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 19, 2020 , 01:12:04

మావోయిస్టుల రీ ఎంట్రీని తిప్పికొడతాం

మావోయిస్టుల రీ ఎంట్రీని తిప్పికొడతాం

  • ప్రజల్లో అలజడి సృష్టించేందుకే తిరిగొస్తున్నారు
  • వారి మాటలను నమ్మి ఆదివాసీలు మోసపోవద్దు 
  • మణుగూరు పర్యటనలో డీజీపీ ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మణుగూరు: ఛత్తీస్‌సఢ్‌ నుంచి తెలంగాణలోకి ప్రవేశించాలనుకుంటున్న మావోయిస్టుల రీ ఎంట్రీని తిప్పికొడతామని డీజీపీ ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి అన్నారు. ఇక్కడి అభివృద్ధి ఫలాలతో సంతోషంగా జీవిస్తున్న ప్రజల్లో అలజడి సృష్టించేందుకు వారు తిరిగివస్తున్నారని ఆరోపించారు. వారి మాటలు నమ్మిమోసపోవద్దని ఆదివాసీలకు సూచించారు. వారు అభివృద్ది నిరోధకులను అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అడవుల్లో ఇటీవల మావోయిస్టులకు, పోలీసులు మధ్య కాల్పులు జరగడం, ఓ జవాన్‌ గాయపడడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యం లో శనివారం మణుగూరు వచ్చిన ఆయన అక్కడి సింగరేణిలో ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉందని, ప్రజలందరూ మనశ్శాంతితో, సుఖసంతోషాలతో జీవనాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఇలాంటి మంచి వాతావరణం ఉన్న సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టులు మళ్లీ తెలంగాణలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు. మావోయిస్టుల రీ ఎంట్రీని తెలంగాణ పోలీసులు దృఢంగా ఎదుర్కొంటున్నారని అన్నారు.
పోలీసుశాఖను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడానికే ఈ సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. అడిషనల్‌ డీజీ గ్రేహౌండ్స్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి, ఇంటిలిజెన్సీ ఐజీ నవీన్‌ చంద్‌, ఐజీ (ఎస్‌ఐబీ) ప్రభాకర్‌రావు, ఐజీ ప్రమోద్‌కుమార్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏస్పీ సునీల్‌దత్‌, మహాబూబాబాద్‌ ఏస్సీ కోటిరెడ్డి, అడిషనల్‌ ఏస్పీ (అపరేషన్‌)ఎస్పీ ఏ. రమణారెడ్డి, మణుగూరు ఏఏస్పీ డాక్టర్‌ పి. శబరీష్‌, భద్రాచలం ఏఏస్సీ రాజేశ్‌చంద్ర, అడిషనల్‌ ఏస్పీ సాయిబాబా, ఏఆర్‌ అడిషనల్‌ ఏస్పీ కిష్టయ్య, డీఎస్పీలు కేఆర్‌కే ప్రసాద్‌రావు, రవీందర్‌రెడ్డి, నరేష్‌కుమార్‌, సీఐలు, ఎస్పైలు పాల్గొన్నారు.