శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 18, 2020 , 01:20:26

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే సండ్ర

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గ సమస్యలపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి నూతన గదుల నిర్మాణానికి నిధులు, సింగరేణి సంస్థ నిధులతో ఎన్టీఆర్‌ కాలనీ ఎదురుగా నిర్మిస్తున్న ఫారెస్ట్‌ అర్బన్‌పార్కుకు నిధులు మంజూరు, సత్తుపల్లి రింగ్‌సెంటర్‌ నుంచి రేజర్ల వరకు రహదారిని విస్తరించి సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు, సత్తుపల్లి-పెనుబల్లి వరకు జాతీయ రహదారి నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని కోరినట్లు తెలిపారు. సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు నూతన అంబులెన్స్‌లు మంజూరు చేయాలని, ప్రభుత్వ బాలుర పాఠశాల, జూనియర్‌ కళాశాలలకు నూతన భవనాలు మంజూరు చేయాలని, గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన నష్టపరిహారం ఇప్పించాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి సత్తుపల్లి ప్రాంత అభివృద్ధికి నిత్యం సహాయ, సహకారాలు ఉంటాయని, ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే సండ్ర తెలిపారు.

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

కారేపల్లి: సింగరేణి మండలానికి ఏకలవ్య పాఠశాల మంజూరు చేసినందుకు టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాళోత్‌ శకుంతల మాట్లాడుతూ.. సింగరేణి మండలానికి ఏకలవ్య పాఠశాల కేటాయించటం గర్వించదగ్గ విషయమన్నారు. అనంతరం పాఠశాల భవన నిర్మాణానికి ఉచితంగా 12ఎకరాల భూమిని వితరణగా ఇచ్చిన పర్సా ట్రస్ట్‌ చైర్మన్‌ పర్సా పట్టాభిరామారావును సన్మానించారు. వైరా ఆత్మ కమిటీ చైర్మన్‌ ముత్యాల సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు పిచ్చయ్య, అజ్మీర వీరన్న, వైస్‌ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ బానోత్‌ పద్మావతి, చీమలపాడు సర్పంచ్‌ కిశోర్‌, సొసైటీ డైరెక్టర్‌ అడ్డగోడ ఐలయ్య, పిల్లి వెంకటేశ్వర్లు, బత్తుల శ్రీనివాసరావు, దాచేపల్లి కృష్ణారెడ్డి, ఎం.డి హనీప్‌ పాల్గొన్నారు.