గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 18, 2020 , 00:50:12

బాధితుల‌కు బాస‌ట‌

బాధితుల‌కు బాస‌ట‌

  • బాధితులకు కరోనా పాటిజివ్‌ వ్యక్తులకు ఇంట్లోనే వైద్యం
  • ఖమ్మంలో 70, భద్రాద్రిలో 58 మందికి హోం ఐసోలేషన్‌ సేవలు 
  • ప్రతి ఒక్కరికీ 12 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్‌ 
  • ప్రతిరోజూ పేషెంట్‌ను పర్యవేక్షిస్తున్న వైద్యారోగ్య సిబ్బంది
  • అత్యవసరమైతేనే ఆసుపత్రి ఐసోలేషన్‌కి  

కొవిడ్‌ బాధితులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తున్నది. కరోనా పాజిటివ్‌ వచ్చి ఇతర వ్యాధులతో కూడా బాధపడే వారికి మాత్రమే ప్రభుత్వ వైద్యశాలల్లోని ఐసోలేషన్‌లో వైద్యం అందిస్తున్నది. లక్షణాలు లేని వారికి హోం ఐసోలేషన్‌ ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇంట్లో ప్రత్యేక గది, ఇతర సదుపాయాలు ఉన్న రోగులకు 12వస్తువులతో కూడిన హోం ఐసోలేషన్‌ కిట్లను అందిస్తూ భరోసా కల్పిస్తున్నది. బాధితులకు ఇబ్బంది లేకుండా వారి ఇంటికి వెళ్లి వైద్యసేవలు అందించండంలో వైద్య సిబ్బంది ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 70, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 58 మంది హోం ఐసోలేషన్‌లో వైద్యసేవలు పొందుతున్నారు. 


భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మయూరిసెంటర్‌: కరోనాతోపాటు ఇతర వ్యాధులు కూడా ఉండి అత్యవసర చికిత్సలు అందించాల్సిన వారిని మాత్రమే ప్రభుత్వాసుపత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచుతున్నది ప్రభు త్వం. ఇంట్లో ప్రత్యేక సదుపాయాలు లేని రోగులకు కూడా కొవిడ్‌ ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచుతున్నది. రోగికి ఇతర వ్యాధులు కూడా ఉండి, కరోనాకు కూడా అత్యవసర చికిత్స అందించాల్సి వస్తే ఐసీయూలను, వెంటిలేటర్లను, ఆక్సిజన్‌ బెడ్ల ను సిద్ధంగా ఉంచింది. కరోనా తీవ్రత పెద్దగా లేని వారికి మాత్రం హోం ఐసోలేషన్‌ను రిఫర్‌ చేస్తున్నది. ఇ ప్పుడు ఈ హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతు న్న వారికి 10 రోజులకు సరిపడా మందులు, ఇతర వస్తువులతో కూడిన కిట్‌ అందిస్తున్నది. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉంటున్న రోగులకు మెరుగైన వైద్యం అందుతున్నట్లవుతున్నది.    

ఇంటిలోనే వైద్య సేవలు

కరోనా పాజిటివ్‌ అని తేలిన తరువాత రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి అతిన్ని ప్రభుత్వ ఆసుప్రతి ఐసోలేషన్‌ వార్డులో ఉంచాలా? లేక హోం ఐసోలేషన్‌ వార్డులో ఉంచాలా? అని వైద్యులు నిర్ణయిస్తారు. రోగికి తన ఇంట్లో ప్రత్యేక గది, ఇతర వసతులు ఉండి, అతడు కోరుకుంటే హోం ఐసోలేషన్‌కే ప్రాధాన్యమిస్తారు. ఇలా చికిత్స పొందుతున్న వారికి ఇప్పుడు ప్రత్యేక కిట్‌ను అందిస్తున్నారు. వైద్య సిబ్బంది కూడా వారి ఆరోగ్య పరిస్థితిని ప్రతి రోజూ పర్యవేక్షిస్తారు. కుటుంబ సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ సమయంలో ఎలాంటి మందులు వాడాలి? ఏ రకమైన ఆ హారాన్ని పేషెంట్‌కు అందించాలి? ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలి? అనే చార్టును కూడా ఆ కిట్‌లో ఉంచుతారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 70 మంది, భద్రాద్రి జిల్లాలో 58 మంది హోం ఐసోలేషన్‌ సేవలు పొందుతున్నారు. 

అత్యవసరం అయితేనే  ఆసుపత్రి ఐసోలేషన్‌లో..

అత్యవరం అయితేనే రోగిని ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. మణుగూరు ఐసోలేషన్‌ వార్డులో ఐదుగురు, కొత్తగూడెం ఐసోలేషన్‌ వార్డులో ముగ్గురు రోగులు అత్యవసర చికిత్సలు పొందుతున్నారు. 

హోం ఐసోలేషన్‌ కిట్లో  ఏమున్నాయంటే.. 

12 వస్తువులతో కూడిన ఈ ప్రత్యేక కిట్‌లో ‘డోలో 650 ఎంజీ (పారాసిట్మల్‌) 10, లివో సిట్రిజిన్‌ 10, విటమిన్‌-సీ టాబ్లెట్స్‌ 10, జింక్‌ టాబ్లెట్స్‌ 10, బీ కాంప్లెక్స్‌ 10, విటమిన్‌ డీ 5, విటమిన్‌ ఈ 5, క్లాత్‌ మాస్కులు 6, శానిటైజర్‌ (100 మిల్లిలీటర్స్‌) 1, హ్యాండ్‌ వాష్‌ (200 మిల్లిలీటర్స్‌) 1, గ్లోవ్స్‌ 5, సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం బాటిల్‌ (లీటర్‌) 1 ఉన్నాయి. కొవిడ్‌ బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి వైద్య సిబ్బంది త్వరలోనే వీటిని అందజేయనున్నారు. కాగా జిల్లాలో పూర్తిస్థాయిలో కరోనా టెస్టులు చేసే సదుపాయాన్ని ఖమ్మం ప్రభుత్వ ప్రధానాసుపత్రితోపాటు మమత హాస్పిటల్లో ఆగస్టు నుంచి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పంపిణీకి ప్రణాళికలు చేపట్టాం..

ఇంట్లో సదుపాయాలుంటే కొవిడ్‌ బాధితులను హోం ఐసోలేషన్‌లోనే ఉంచుతాం. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో అందుబాటులో ఉండే మందులను స్థానిక ఏఎన్‌ఎం ద్వారా రోగుల ఇళ్లకు పంపిస్తాం. హోం ఐసోలేషన్‌ కిట్‌ను ఇంటి వద్ద చికిత్స పొందుతున్న బాధితులకు అం దేలా ప్రత్యేక చర్యలు చేపట్టాం. కిట్‌లోని ఔషధాలు, వస్తువులు సమకూర్చేందుకు టెండర్లు కూడా జారీ చేశాం. త్వరలోనే వీటిని పంపిణీ చేస్తాం.

- డాక్టర్‌ బి.మాలతి, డీఎంహెచ్‌వో, ఖమ్మం 

జిల్లాలో ఎవరికీ ఇబ్బంది లేదు..

కరోనా పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రతి రోజూమా వైద్యారోగ్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చే కరోనా కిట్స్‌ను రోగుల ఇంటికి వెళ్లి అందజేస్తున్నారు. అవసరమైన వారితో డాక్టర్లు సైతం మాట్లాడుతున్నారు. మనోధైర్యం అందిస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న వారు కూడా చాలా మంది ఇప్పటికే కోలుకుంటున్నారు. జిల్లాలో 66 మంది కరోనా బారిన పడగా ఇప్పటికే 24 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.

- డాక్టర్‌ భాస్కర్‌నాయక్‌, డీఎంహెచ్‌వో, కొత్తగూడెం