బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 17, 2020 , 03:22:29

‘ఆన్‌లైన్‌' క్లాసులపై ఆందోళన

‘ఆన్‌లైన్‌' క్లాసులపై ఆందోళన

  • ఎక్కువ సమయం ఉంటాయేమోనని  తల్లిదండ్రుల అనుమానం
  • పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందనే భయం
  • వైద్యుల సూచనలు, స్క్రీన్‌ టైం  తగ్గింపుపై హర్షం 

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: పాఠశాలల్లేవు. క్లాసులున్నాయి. పరీక్షలున్నాయి. మార్కులున్నాయి. పాఠశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాయి. దృశ్య-శ్రవణ మాధ్యమాల (సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌) ద్వారా గంటల తరబడి పాఠాలు బోధిస్తున్నాయి. ఇలా గంటల తరబడి స్క్రీన్‌కు కళ్లు అతుక్కుపోవడం, చెవుల్లో మోతలు మోగుతుండడంతో చిన్నారులకు కంటి నొప్పి, చెవి నొప్పి వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  

ఆన్‌లైన్‌ తరగతులతో పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్న విషయం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ) దృష్టికి వెళ్లింది. ఆ వెంటనే స్పందించింది. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై ఇటీవల మార్గదర్శకాలను జారీ చేసింది ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌ 30 నిమిషాలకు మించకూడదని చెప్పింది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు 45 నిమిషాల చొప్పున రెండు సెషన్స్‌గా, 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 35 నుంచి 45 నిమిషాలపాటు నాలుగు సెషన్లుగా బోధించవచ్చని మార్గదర్శకాలు వెలువరించింది. దీనిపై తల్లిదండ్రులు హర్షామోదం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు కూడా ‘ఏకబిగిన రెండు నుంచి నాలుగైదు గంటలపాటు చూడడం-వినడం కన్నా కూడా మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ గంటకు మించకుండా ఆన్‌లైన్‌ క్లాసుకు హాజరైతే ఇబ్బందేమీ ఉండదు’ అంటున్నారు.