శుక్రవారం 07 ఆగస్టు 2020
Badradri-kothagudem - Jul 16, 2020 , 00:34:02

ప్రాధాన్యాంశాలకు అనుగుణంగా.. అటవీభూముల కేటాయింపులు

ప్రాధాన్యాంశాలకు అనుగుణంగా.. అటవీభూముల కేటాయింపులు

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

కొత్తగూడెం: ప్రభుత్వ ప్రాధాన్యాంశాలకు అనుగుణంగా చేపట్టిన వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు అటవీ భూములు కేటాయించనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అటవీ హక్కుల చట్టం జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల ఏర్పాటుకు ప్రభుత్వ, గ్రామకంఠం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న స్థలాలు లేని సందర్భంతోపాటు గ్రామ అవసరాలు నిమిత్తం దాతలు కూడా ముందుకురాని సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో అటవీ భూములు వినియోగించుకోనున్నామని అన్నారు. జిల్లాలో 131 ప్రాంతాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల ఏర్పాటుకు స్థలాల సమస్య ఏర్పడగా అటవీ భూములు కేటాయించాలని జిల్లా కమిటీ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కేటాయించిన 131 స్థలాల్లో పెండింగ్‌లో ఉన్న 10 స్థలాలు అప్పగించేందుకు కమిటీ ఆమోదించినట్లు స్పష్టం చేశారు. భూములు కేటాయింపును ఎంపీడీవో, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి ఐటీడీఏ పీవో ద్వారా జిల్లా కమిటీ సిఫార్సు చేయడం జరుగుతుందని అన్నారు.

సిఫార్సు చేసిన భూములను జిల్లా స్థాయి అటవీహక్కుల కమిటీ పరిశీలించి భూ కేటాయింపులు చేయనున్నట్లు వివరిచారు. ఐటీడీఏ పీవో గౌతమ్‌, అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు, జిల్లా అటవీశాఖాధికారి రంజిత్‌, డీఆర్‌డీవో మధుసూదన్‌రాజు, పీఆర్‌ ఈఈ సుధాకర్‌, డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్‌, ఆర్డీవో స్వర్ణలత, జిల్లా కమిటీ సభ్యులు, పినపాక, ఇల్లెందు మండలాల జడ్పీటీసీలు కాంతారావు, ఉమాదేవి పాల్గొన్నారు.


logo