బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 14, 2020 , 02:55:30

వీడియోకాల్‌ ‘ఫిర్యాదు’

వీడియోకాల్‌ ‘ఫిర్యాదు’

  • పోలీస్‌ స్టేషన్లలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు
  • వైరా పోలీస్‌ సబ్‌ డివిజన్‌లో కెమెరాల ద్వారా విచారణ
  • అత్యాధునిక సాంకేతికత వినియోగం
  • ఖమ్మం సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆదేశాల మేరకు అమలు

వైరా: కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్‌..! ప్రస్తుతం పాటిజివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. జనం కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిలో భాగంగా ఖమ్మం సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆదేశాల మేరకు పోలీస్‌శాఖ అధికారులు పీఎస్‌ల పరిధిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే వారి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. వైరా సర్కిల్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పోలీసులు వీడియో కాల్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు.

అన్ని పీఎస్‌లలో..

ఖమ్మం జిల్లాలో మొత్తం 25 లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్లు, ఒక మహిళా పోలీస్‌ స్టేషన్‌, క్రైం పోలీస్‌ స్టేషన్‌, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. పీఎస్‌లలో స్టేషన్‌ హౌస్‌ అధికారులు ఫిర్యాదుదారులతో మాట్లాడేందుకు వీడియోకాల్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఇటీవల సీపీ తఫ్సీర్‌ఇక్బాల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కో స్టేషన్‌లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోనే ప్రప్రథమంగా వైరా ఏసీపీ కె.సత్యనారాయణ నేతృత్వంలో వైరా సీఐ జె.వసంత్‌కుమార్‌ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

వీడియోకాల్‌ను ఉపయోగించడం ఇలా..

పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణాల బయట వీడియోకాల్‌కు సంబంధించిన పరికరాలు అమర్చుతున్నారు. ఫిర్యాదుదారుడు పోలీస్‌ స్టేషన్‌కు రాగానే పోలీస్‌ సిబ్బంది అతడితో మాట్లాడుతున్నారు. ఫిర్యాదుకు సంబంధించిన సమాచారం తెలుసుకుని వీడియో కెమెరా ముందు కుర్చీ వేసి కూర్చోబెడుతున్నారు. ఫిర్యాదును పరిశీలించిన తర్వాత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, ఎస్సై వీడియోకాల్‌ ద్వారా ఫిర్యాదుదారునితో మాట్లాడుతున్నారు. వైరా పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని వైరా, కొణిజర్ల, తల్లాడ, మధిర పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని పీఎస్‌లలో ఇప్పటికే వీడియో కాల్‌ విధానం అమలవుతున్నది.

వైరస్‌ వ్యాప్తి  అరికట్టేందుకు  ప్రత్యేక చర్యలు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీస్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా పోలీసులు వీడియోకాల్‌ ద్వారా ఫిర్యాదుదారులను విచారించి వివరాలు తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా పీఎస్‌ల పరిధిలో విధిగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే వారితో కనీసం 10 అడుగుల దూరం నుంచి మాట్లాడుతున్నారు. వివిధ అవసరాల నిమిత్తం వచ్చే వారి కోసం శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నారు.

సీపీ ఆదేశాలతో ఏర్పాట్లు..

సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆదేశాల మేరకు వైరా ఏసీపీ కె.సత్యనారాయణ నేతృత్వంలో వైరా సర్కిల్‌లోని పోలీస్‌స్టేషన్లలో వీడియోకాల్‌ ద్వారా ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే వైరా, తల్లాడ, కొణిజర్లతో పాటు మధిర పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ విధానం అమలవుతున్నది. ఒకటి, రెండు రోజుల్లో చింతకాని పీఎస్‌లోనూ ఏర్పాటు చేస్తాం. 

- జె.వసంత్‌కుమార్‌, సీఐ  

వీడియో కాల్‌ ద్వారా విచారణ

వైరా పీఎస్‌లో కరోనా కట్టడికి వీడియో కాల్‌ విచారణ ప్రారంభించాం. సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌, వైరా ఏసీపీ కె.సత్యనారాయణ ఆదేశాలతో వైరా సీఐ జె.వసంత్‌కుమార్‌ పర్యవేక్షణలో ఖమ్మం జిల్లాలో ప్రప్రథమంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఫిర్యాదుదారులు భౌతికంగా ఎదురుగా లేకుండానే వీడియో ద్వారా విచారిస్తున్నాం. ఫిర్యాదుదారులూ సహకరిస్తున్నారు.- వి.సురేశ్‌, వైరా ఎస్సై