గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 14, 2020 , 02:49:52

పచ్చదనం ప్రగతికి సంకేతం

పచ్చదనం ప్రగతికి సంకేతం

  • మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
  • ‘ప్లాంటేషన్‌'లో సింగరేణి పాత్ర కీలకం
  • రాష్ట్ర రవాణాశాఖ  మంత్రి పువ్వాడ  అజయ్‌కుమార్‌
  • ఇల్లెందు ఏరియాలో మెగా హరితహారం 

‘పచ్చదనం ప్రగతికి సంకేతం.. నాటిన ప్రతి మొక్క పర్యావరణానికి ప్రాణం పోస్తుంది.. మానవాళి మనుగడకు సాయపడుతుంది..   విరివిగా మొక్కలు నాటితేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుంది.. ఈ క్రతువులో సింగరేణి కీలక పాత్ర పోషిస్తున్నది..’ అని   రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఇల్లెందు సమీపంలోని డీ బ్లాక్‌ ఫిల్టర్‌ బెడ్‌ వద్ద నిర్వహించిన ‘మెగా హరితహారం’  కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు.. ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని  పిలుపునిచ్చారు.. ఆయన వెంట ఎమ్మెల్యే   హరిప్రియానాయక్‌, జడ్పీ చైర్మన్‌ కోరం  కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సింగరేణి జీఎం సత్యనారాయణ తదితరులు ఉన్నారు..                     -ఇల్లెందు

ఇల్లెందు: పచ్చదనం ప్రగతికి సంకేతమని, నాటిన ప్రతి మొక్క మానవాళికి జీవం పోస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం సింగరేణి ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం ఇల్లెందులోని డీబ్లాక్‌ ఫిల్టర్‌ బెడ్‌ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తరిగిపోతున్న అడవులను దృష్టిలో పెట్టుకుని హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్‌ సఫలీకృతులయ్యారన్నారు. ఆరో విడత హరితహారం మరింత విజయవంతం చేసేందుకు ప్రణాళిక రూపొందించారన్నారు. అందులో భాగంగా సింగరేణిని ప్రత్యేకంగా అభినందించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియానాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్యతో కలిసి మొక్కలు నాటారు. తొలుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, రైతుబంధు సమన్వయసమితి సభ్యుడు పులిగళ్ల మాధవరావు, కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలత, డైరెక్టర్‌ ప్రాజెక్టు ప్లానింగ్‌ భాస్కర్‌రావు, అధికారులు గణపతి, వెంకటేశ్వరరావు, సుబ్బారావు, బొల్లం వెంకటేశ్వర్లు, సీహెచ్‌ లక్ష్మీనారాయణ, సైదులు, రామస్వామి పాల్గొన్నారు. 

ప్రతి ఇక్కరూ భాగస్వాములవ్వాలి

రఘునాథపాలెం: ఖమ్మాన్ని పచ్చని నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారంలో భాగంగా సోమవారం బోనకల్‌ రోడ్డు ముస్తాఫానగర్‌ నుంచి అగ్రహారం గేటు వరకు ప్రధాన రోడ్డు వెంట నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో విరివిగా మొక్కలు నాటాలన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ ఖమ్మం జిల్లా కార్యాలయ ఇన్‌చార్జ్‌ ఆర్జేసీ కృష్ణ, నగర పాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, జిల్లా అటవీశాఖ అధికారిణి ప్రవీణ, టేకులపల్లి ఆంధ్రాబ్యాంక్‌ సహకార సొసైటీ  చైర్మన్‌ బీరెడ్డి నాగచంద్రారెడ్డి, కార్పొరేటర్లు కమర్తపు మురళీ, మందడపు మనోహర్‌, ఆళ్ల నిరీశా అంజిరెడ్డి, ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, మధిర నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, ఆళ్ల అంజిరెడ్డి పాల్గొన్నారు.