శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 14, 2020 , 02:41:35

వలసబిడ్డలు వాపసొచ్చిండ్రు

వలసబిడ్డలు వాపసొచ్చిండ్రు

  • పట్నంనుంచి వచ్చిన వారిని  అక్కున్న చేర్చుకున్న పల్లెలు 
  • కార్మికులకు కలిసొచ్చిన సాగుకాలం
  • మిషన్‌ కాకతీయతో  పెరిగిన భూగర్భ  జలాలు
  • సేద్యానికి సై అంటున్న  కార్మికులు,  చిరు ఉద్యోగులు
  • అందుబాటులో ఎరువులు, విత్తనాలు, విద్యుత్‌ 

వలస బతుకులు.. ఈ పేరు వింటేనే ఎన్నో విషాదకర సంఘటనలు కండ్లముందు కదలాడుతుంటాయి. పొట్టకూటికోసం ఉన్న ఊరును, కన్నతల్లిని విడిచి పట్నంపోయిన ఎంతోమంది జీవితాలను కరోనా భయం కకావికలం చేసింది. వెరసి పొట్టచేతపట్టుకొని, భుజాన బిడ్డల్ని ఎత్తుకొని పట్నం నుంచి పల్లెకు తిరిగి పయనమయ్యారు వలసజీవులు. నాడు ఎవుసం దండగని   పట్నంపోయిన వారే.. నేడు పల్లెల్లోని సొంత పొలాల్లో సంతోషంగా సేద్యం చేసుకుంటున్నారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు.. చివరి ఎకరాకూ అందుతున్న   సాగునీరు, ఇంటింటికీ వస్తున్న తాగునీటిని చూసి సంతోషపడుతున్నారు. పట్నం ఆలోచన లేకుండా.. పల్లెల్లోనే తలోపని చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు.

-ఖమ్మం ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం నమస్తే తెలంగాణ 


   ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సలిగంటి లింగయ్య. ఈయనది ఖమ్మం జిలా కాకరవాయి గ్రామం. ఇతను 13 ఏండ్ల క్రితం బతుకుదెరువు  కోసం కుటుంబంతో సహా హైదరాబాద్‌ వెళ్లాడు. నెట్‌ సెంటర్లో పని చేసేవాడు. లాక్‌డౌన్‌ వల్ల అక్కడ జీవనం కష్టతరమైంది. దీంతో సొంతూరుకు వచ్చాడు. తనకున్న నాలుగు ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. రైతుబంధు డబ్బులు కూడా రావడంతో రెండు ఎకరాల్లో వరినారు పోశాడు. ఒక ఎకరంలో పత్తి, మరో ఎకరంలో మిరప సాగుకు సిద్ధ్దం చేస్తున్నాడు. సీఎం కేసీఆర్‌ దయవల్ల తనకు వ్యవసాయం చేసుకునే అవకాశం లభించిందని, ఇక వ్యవసాయం చేసుకుంటూ సొంత ఊరిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాని తెలిపాడు.

ఖమ్మం ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం : సేద్యానికి సరైన సదుపాయాలు లేక ఉన్న ఊరునూ.. కన్నవారిని వదిలి వలసబాట పట్టారు. వ్యవసాయమంటేనే దండుగ అనే అభిప్రాయంతో కూలీనాలీ చేసుకుందామంటూ పట్టణానికి చేరారు. సాగునీరు లేక, పెట్టుబడులు లభ్యం కాక ఉన్న భూములను అరకొర ఒప్పందంతో కౌలుకిచ్చుకొని బతుకుదెరువు కోసం బహుదూరం వెళ్లేవారు. స్వరాష్ట్రం సిద్ధించింది. జలాశయాలు,  కుంటలు నిండాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. దీంతో వలసవెళ్లిన వారికి పానం లేసొచ్చింది. సేద్యానికి అవసరమైన పంట పెట్టుబడి లభ్యమవుతున్నది. గతంలో మాదిరి కరెంటు, ఎరువులు, విత్తనాల కోసం ఎదురు చూడాల్సిన అవసరంలేదు. బీడు భూములన్నీ సాగవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ సాగుకు అనుకూలమైన అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చి, వ్యవసాయరంగాన్ని తీర్చిదిద్దుతుండటంతో వలసపోయినోళ్లు ఊర్లబాట పడుతున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారు తమ గ్రామాలకు చేరుకొని ఉన్న భూమిలో సేద్యం చేసుకోవడంతోపాటు.. మరికొంత భూమిని కౌలుకు తీసుకొని ఆనందంగా పొలంబాట పడుతున్నారు.

ఎటు చూసినా నీళ్లే..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌ తదితర నగరాలకు వలస వెళ్లారు. గతంలో పల్లెల్లో వ్యవసాయం చేసేందుకు అనువైన వనరులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొని పట్టణబాట పట్టారు. తిరిగి సొంత గ్రామాలకు చేరుకున్న వారు తమ ఊళ్లలో సాగునీరు పుష్కలంగా లభ్యమవుతుండడాన్ని చూసి సంతోషడుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ఎటు చూసినా నీరే కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్‌ చేపట్టిన మిషన్‌ కాకతీయ వల్ల చెరువుల్లో నీటి మట్టం పెరగడంతోపాటు భూగర్భజలాలు పెరిగాయి. వేసవిలోనే రెండు జిల్లాల్లోని మేజర్‌ చెరువులను సాగర్‌ జలాలతో ప్రభుత్వం నింపింది. గతంలో వర్షాధారంపై ఆధారపడే రైతన్నలు ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న నీటి సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం కొద్దిపాటి వర్షాలకే రైతులు వరినార్లు పోశారు. గతంలో ఖమ్మం జిల్లాలోని మెట్టప్రాంతమైన తిరుమలాయపాలెం మండలం కరువు ప్రాంతంగా ఉండేది. కేవలం బోర్లు, చెరువులపైనే ఆధారపడి వాణిజ్యపంటలు పండించేవారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది ఆ మండలంలో ఎటు చూసినా నీరు పుష్కలంగా కనిపిస్తున్నది. గ్రామగ్రామానా చెరువులు నిండాయి. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రెండు పంటలు పండించేందుకు అవసరమైన సాగునీరు అందుబాటులో ఉంది.

అందివచ్చిన ప్రభుత్వ సాయం..

ఎన్నో ఏండ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటున్న రైతుల భూములకు పట్టాలు ఉండేవికావు. సాదాబైనామా పేరుతోనే సాగు చేసుకొనేవారు. పాసు పుస్తకం ఉన్నవారికే ప్రభుత్వ పథకాలు అందేవి. స్వరాష్ట్రం సిద్ధించాక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. భూ రికార్డుల ప్రక్షాళనతో సమస్యలు పరిష్కారమై లక్షలాది మంది రైతన్నలకు మేలు చేకూరింది. సాదాబైనామాకు పాస్‌బుక్కులు అందించి రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.10 వేలు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నది. దీంతో రైతుల్లో సేద్యం పట్ల మక్కువ పెరిగింది. పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధరను కూడా అందిస్తుండటంతో సాగుదారుల్లో ఉత్సాహం ఉరకలేస్తున్నది. కౌలు చేయడానికి భూమి దొరకడం కూడా కష్టంగా మారుతున్నది. సొంతూరు, సొంతిల్లు, కుటుంబాన్ని వదిలి ఉపాధివేటలో అలసిపోవడం కన్నా.. స్థానికంగా సాగుచేసుకోవడమే ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెంలోనూ ఇదే పరిస్థితి..

సమైక్యపాలనలో కుదేలైన పల్లె జీవనం.. స్వరాష్ట్ర పాలనలో నూతనత్వాన్ని సంతరించుకుంటున్నది. కులవృత్తులు జీవం పోసుకుంటున్నాయి. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. దీంతో పల్లెజీవనం పట్టాలెక్కుతున్నది. పట్నం నుంచి వచ్చిన వారికి  ఈ వ్యవసాయ సీజన్‌లో ఉపాధి దొరుకుతున్నది. సొంత భూములున్న వారు వ్యవసాయం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇప్పటి వరకు బోసిపోయిన పల్లెలు.. జనం రాకతో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం కూడా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజులకు తగ్గకుండా వారికి పని కల్పిస్తున్నది. కరోనా కారణంగా పల్లెలకు చేరుకున్న వలస కార్మికులకు ఇక్కడ సాగు కాలం కలిసొచ్చింది. వానకాలంలో సాగు పనులు మొదలు కావడంతో తిరిగివచ్చినోళ్లందరూ వ్యవసాయ పనుల వైపు మొగ్గు చూపారు.

కౌలుభూమితో   సాగు ప్రారంభించా..  

 మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వెళ్లా. సినిమా థియేటర్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసేవాడిని. లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయా. ప్రస్తుత పరిస్థితిలో హైదరాబాద్‌లో ఉండలేక సొంతూరికి కుటుంబంతో తిరిగి వచ్చా. మాకు రెండు ఎకరాల భూమి ఉంది. దానికితోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నా. రెండు ఎకరాల్లో పత్తి వేశా. మరో రెండు ఎకరాలు వరి పొలం వేసేందుకు నారు పోశా. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన శ్రీభక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా మా ప్రాంతంలో చెరువులకు సాగు నీరు పుష్కలంగా వచ్చింది. రైతుబంధు డబ్బులొచ్చాయి. ఇక ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటా.

- లింగాల వెంకన్న, పాతర్లపాడు గ్రామం, ఖమ్మం జిల్లా

రెండెకరాల్లో పత్తివేశా..  

వ్యవసాయంలో నష్టాలు ఎదురుకావడం, ఇంటి అవసరాలకు ఖర్చులు పెరగడంతో అప్పులపాలయ్యా. ఉన్న పొలం కౌలుకు ఇచ్చి బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వెళ్లా. ఓ ప్రైవేటు పరిశ్రమలో పనులు చేసుకుంటూ జీవనం సాగించాం. లాక్‌డౌన్‌లో అక్కడ బతకలేక మళ్లీ ఇంటికి చేరుకున్నాం. ఉన్న 2 ఎకరాల చెలకలో పత్తి వేశాను. కుటుంబసభ్యులంతా కలిసి చేనులో పనులు చేస్తున్నాం.

- భూక్యా భద్రు, కొమరారం గ్రామం,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

కూలి పనులు దొరుకుతున్నాయ్‌..

వ్యవసాయం చేసేందుకు భూమి లేకపోవడం. పనులు సరిగా దొరక్కపోవడంతో కుటుంబంతో సహా హైదరాబాద్‌ వెళ్లాం. అక్కడ రోజు కూలీగా పనులు చేసుకుంటూ జీవనం సాగించా. నెలలో 15 నుంచి 20 రోజులు మాత్రమే పనులు దొరికేవి. కరోనా వైరస్‌ వ్యాప్తితో మళ్లీ ఇంటికి చేరుకున్నా. ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ప్రతి రోజూ పని దొరుకుతున్నది. రోజు కూలి కూడా రూ.300లకు పైగానే వస్తున్నయ్‌. సొంతూరిలోనే పని దొరుకుతుండడంతో.. హైదరాబాద్‌ ఆలోచనే రావడంలేదు.

 - నర్సయ్య, కొమరారం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా