మంగళవారం 11 ఆగస్టు 2020
Badradri-kothagudem - Jul 13, 2020 , 04:26:49

సిరి గంధం..!

సిరి గంధం..!

  • తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు
  • ఆసక్తి చూపుతున్న రైతులు

‘శ్రీ’ అంటే.. సిరి, సంపద.. అని అర్థం. శ్రీగంధం సాగు.. పేరుకు తగ్గట్టుగానే రైతులకు సిరిసంపదలను అందిస్తున్నది. వేడి, గాలిలో తేమ కలిగిన వాతావరణంలో సంవత్సరానికి 800 నుంచి 900 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఈ చెట్లు పెరుగుతాయి. నీరు నిల్వ ఉండని, సారవంతమైన సేంద్రియ పదార్థాలున్న అన్ని రకాల నేలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎరుపు నేలలు, ఉదజని సూచి 6.5-7.5 వరకు ఉండాలి. మొరం   కలిగిన క్షారగుణం కలిగిన నేలలు, గులకరాళ్ల భూముల్లో కూడా దీనిని పెంచవచ్చు.                                          -చుంచుపల్లి

శ్రీగంధం పెంచాలనుకున్న నేలను రెండు మూడుసార్లు అడ్డం-నిలువుగా దున్ని కలుపు లేకుండా చేయాలి. వేడి, వర్షాభావ పరిస్థితులుగల ప్రాంతాల్లో 45 X 45 సెంటీమీటర్ల లోతు గుంతల్లో ఈ మొక్కలను నాటాలి. మొక్కకూ మొక్కకూ మధ్యన 13 X 13 సెంటీమీర్ల దూరం ఉండాలి. వీటికి దగ్గరలో రెండువైపులా కంది, కరివేపాకు, దీర్ఘకాలం ఉండే క్యాషురీనా, పండ్ల మొక్కలను నాటాలి. మురుగు నీటి వసతి లేని భూముల్లో ఎత్తు బెల్డు చేసి 45 X 45 సెంటీమీటర్ల గుంతల్లో మొక్కలను నాటుకోవాలి. 

విత్తనాలు, మొక్కల ఎంపిక..

15 నుంచి 30 సంవత్సరాల వయసున్న చెట్ల నుంచి సేకరించిన విత్తనాలను మాత్రమే ఎంచుకోవాలి. సాధారణంగా 7-8 నెలల వయసు ఉండి 30-35 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన మొక్కలను పొలంలో నాటేందుకు ఎంపిక చేసుకోవాలి. తవ్విన గుంతలను కొన్ని రోజుల వరకు వదిలేసి ఎండ తగిలేలా చూడాలి. దీంతో ఏవైనా చెద పురుగులు, క్రిమికీటకాలు ఉన్నట్లయితే నశిస్తాయి. వర్షాకాలంలో గుంతల్లో గడ్డి, చెత్త వేసి తగులబెట్టాలి. నాణ్యమైన దిగుబడికి, తైల ఉత్పాదనకు జీవన ఎరువులు వాడాలి.

సాగు.. బాగు..

  • శ్రీగంధం చెట్లు పెంచుతున్నామంటే.. సిరి సంపదలను పెంచుతున్నట్లుగానే భావించవచ్చు. ఈ చెట్టు నుంచి వచ్చే తైలాన్ని సబ్బుల తయారీ, ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు, అత్తరు తయారీలో వాడతారు. ఈ చెట్లు సాధారణంగా 30 సంవత్సరాలకు ప్రతిఫలాన్ని ఇస్తాయి. సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే 20 సంవత్సరాల తరువాత మంచి దిగుబడి వస్తుంది. శ్రీగంధం తైలం చేవకు మంచి గిరాకీ ఉంది. 20 సంవత్సరాల తర్వాత ఎకరం విస్తీర్ణంలోని తోటకు దాదాపుగా రూ. 3కోట్ల విలువైన నికర ఆదాయం వస్తుంది. మన రాష్ట్రంలోని ములుగు, సిద్ధిపేట జిల్లాల్లో ఈ లభిస్తాయి. ఒక మొక్క ధరను ప్రభుత్వం రూ.30గా నిర్ణయించింది. 
  • శ్రీగంధం ఒక నిత్య పచ్చని చెట్టు. ఇది 13 నుంచి 16 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.
  • ఈ చెట్టును పెంచేందుకు మన రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అందుకే దీనిని రైతులు తమ పొలాల్లో ఇతర పంటలతోపాటు సాగు 
  • చేయవచ్చు.
  • ప్రపంచవ్యాప్తంగా శ్రీగంధం చెట్ల రకాలు 15 వరకు ఉన్నాయి. మన దేశంలో సాగవుతున్న శ్రీగంధం చెట్లకు చాలా విలువ ఉంది. 

 పెంపకంలో  జాగ్రత్తలు తప్పనిసరి..

ఈ శ్రీగంధం మొక్క వేర్లు నేల నుంచి నేరుగా పోషకాలను తీసుకోలేవు. పక్కనున్న మొక్క వేరు నుంచి తీసుకుంటుంది. అందుకే, ఈ మొక్కలను నాటిన తర్వాతగానీ, ముందుగాగానీ కందిని విత్తుకోవాలి. క్రోటాన్‌ మొక్కలను కూడా నాటుకోవాలి. ఆ తర్వాత సరుగుడు, మలబారు వేప, టేకు వంటి మొక్కలను కూడా పెంచితే శ్రీగంధం మొక్కలు త్వరగా పెరుగుతాయి. అంతేకాదు, మిగతా మొక్కల నుంచి కూడా అదనపు ఆదాయం వస్తుంది. ఒక ఎకరంలో 250 మొక్కలను నాటితే.. 5000 కిలోల దిగుబడి వస్తుంది. శ్రీగంధం పెంచుతున్నామంటే.. సిరిసంపదలను పెంచుతున్నట్లుగానే భావించవచ్చు. 

-మరియన్న, జిల్లా ఉద్యాన అధికారి, భద్రాద్రిlogo