శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Badradri-kothagudem - Jul 13, 2020 , 04:05:50

కొత్తగూడెంలోనే కరోనా నిర్ధారణ

కొత్తగూడెంలోనే కరోనా నిర్ధారణ

  • భద్రాద్రి జిల్లా ఐసోలేషన్‌ వార్డుల్లో 77 పడకలు
  • అనుమానితుల శాంపిళ్ల సేకరణ
  • కేవలం రెండు గంటల్లోనే ఫలితాలు
  • కాంటాక్ట్‌ లిస్ట్‌ను త్వరగా గుర్తించేందుకు అవకాశం

కరోనా మహమ్మారి చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తున్నది.. ఉమ్మడి జిల్లాలో కేసుల సంఖ్య    రోజురోజుకూ పెరుగుతున్నది.. దీంతో ప్రజలు    భయాందోళనకు గురవుతున్నారు.. ఈ నేపథ్యంలో    వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం  యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నది.. దీనిలో భాగంగా కొత్తగూడెంలో జిల్లా ఆస్పత్రిలో  నేటి నుంచి వైద్యసిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలు    నిర్వహించనున్నారు.. శాంపిళ్లు ఇచ్చిన కేవలం       రెండు గంటల్లోనే ఫలితాలు వెల్లడించనున్నారు.. ఇప్పటికే ల్యాబ్‌కు అన్ని పరికరాలూ సమకూరాయి.. ఇక టెస్టులు   నిర్వహించడమే తరువాయి.   

కొత్తగూడెం : చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనాతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురువుతున్నారు. ఈనేపథ్యంలో వారిలో ధైర్యం నింపేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేటినుంచి కరోనా పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా బాధితులకు పరీక్షలను మరింత అందుబాటులో ఉంచాలని జిల్లా ఆసుపత్రిలో కరోనా పరీక్ష సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో టీబీ పరీక్షలు నిర్వహించిన సెంటర్‌లోనే ఈ పరీక్షలు చేయనున్నారు. కొవిడ్‌ ఐసోలేషన్‌ గదిపక్కనే ఈ టెస్టింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రెండు గంటల్లోనే పరీక్షల ఫలితాలు వచ్చేలా ప్రత్యేక మిషనరీని అందుబాటులో ఉంచారు. దీంతో నేటి నుంచి కరోనా అనుమానితులకు పరీక్షలు చేయనున్నారు.

ప్రజల్లో ఆత్మైస్థెర్యాన్ని  నింపుతున్న ప్రభుత్వం

కరోనా మహమ్మారి బాధితులకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కరోనా రోగులు ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ పడకలను ఏర్పాటు చేసింది. రోగులకు మెరుగైన వైద్యం అందించేందకు తగినన్ని ఏర్పాట్లు చేస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా ప్రారంభదశలో ఈ వైరస్‌ను సమష్టి కృషితో అరికట్టారు. తర్వాత రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఈ మహమ్మారి క్రమంగా విస్తరిస్తున్నది. అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం రోగులకు అండగా ఉంటూ, వారున్న ప్రాంతాల్లోనే వైద్యం అందేలా చర్యలు చేపట్టింది. ప్రతి ప్రభుత్వ ఆసుత్రిలో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసి, అత్యవసరమైన రోగుల కోసం వెంటిలేటర్లను కూడా అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం మొత్తం 55 పాజిటివ్‌ కేసులు ఉండగా.. 25 యాక్టివ్‌ కేసులున్నాయి. 29 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఒకరు చనిపోయారు.


సరిపడా పడకలు

కరోనా వైరస్‌ బాధితుల కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఒకడుగు ముందుకు వేసింది. ఇప్పటికే కరోనా రోగుల కోసం భద్రాచలంలో 15, పాల్వంచలో 8, కొత్తగూడెంలో 18, ఇల్లెందులో 6, సింగరేణిలో 30 ఐసోలేషన్‌ పడకలను అందుబాటులో ఉంచింది. మణుగూరు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 105 క్వారంటైన్‌ పడకలను అందుబాటులో ఉంచారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తులతో కాంటాక్ట్‌ అయినవారి ఇండ్లకు వెళ్లి వారికి పరీక్షలు చేయించి, ఇతరులకు కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకోసం ప్రత్యేక టీంలను కూడా అందుబాటులో ఉంచింది. ప్రతి నియోజకవర్గం లో ఆయా మండలాల్లో కూడా ఏఎన్‌ఎంలతో పా టు, ఆశాలను, అంగన్‌వాడీ, పోలీస్‌, పంచాయతీ కార్యదర్శులకు విధులు కేటాయించడంతో కరోనా పాజిటివ్‌ కేసుల కాంటాక్ట్‌లిస్టును వెం టనే తెలుసుకోగలుగుతున్నారు. కరోనా రోగులకు సమస్యలు వచ్చినా, అనుమానితులు జిల్లాలోకి వచ్చినా వారి కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో 918744- 241950, డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో 918744-246655 నెంబర్లను అందుబాటులో ఉంచారు. భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 360 పడకలకు ఆక్సిజన్‌ బెడ్స్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం 


కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో 77 ఐసోలేషన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయి. రోగులు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది వస్తే అందుబాటులో బెడ్స్‌ ఉన్నాయి. వైద్యులు ఉన్నారు. మణుగూరులో క్వారంటైన్‌ సెంటర్‌ కూడా ఉంది. సింగరేణి ఆసుపత్రిలో కూడా 30 పడకలు ఉన్నాయి. జిల్లా ఆసుపత్రిలో వెంటిలేటర్‌ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశాం. 

- భాస్కర్‌ నాయక్‌. డీఎంఅండ్‌హెచ్‌ఓ  logo