శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 12, 2020 , 07:50:51

రేగ‌ళ్ల నిండా పీవీ జ్ఞాప‌కాలు

రేగ‌ళ్ల నిండా పీవీ జ్ఞాప‌కాలు

  • ‘సోమరాజు’ గారిల్లు.. మాజీ ప్రధాని చిన్న కుమార్తె విజయ మెట్టినిల్లు
  • 1982లో డాక్టర్‌ రామకిషన్‌బాబుతో వివాహం
  • హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా వేడుక జరిపించిన పీవీ
  • ఆయన జ్ఞాపకాలను పంచుకున్న గ్రామస్తులు
  • రేగళ్ల వియ్యంకుడు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల ప్రాంతానికి చెందిన పేరొందిన పెద్ద రైతు సోమరాజు రామారావు దొరకు మంచి పేరు ఉంది. ఆయనకు ఆరుగురు కుమారులు. పెద్ద కుమారుడు డాక్టర్‌ రామకిషన్‌ బాబు. సోమరాజు రామారావు దొర, పీవీ నర్సింహారావు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది. పీవీ చిన్న కుమార్తె విజయకు, సోమరాజు పెద్ద కుమారుడు రామకిషన్‌ బాబుకు 1982లో హైదరాబాద్‌లో పెళ్లి జరిగింది. అప్పుడు మన పీవీ నర్సింహారావు కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అలా ఆయన చిన్న కుమార్తె.. ఈ జిల్లాలోని మారుమూలనున్న రేగళ్ల ప్రాంతానికి కోడలిగా వచ్చారు. ఆ పెళ్లికి సోమరాజు రామారావు దొర బంధువులు, మిత్రులు, సన్నిహితులు, రేగళ్ల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సుల్లో ఆ పెళ్లికి వెళ్లారు. ఆనాడు అగ్రశేణి రాజకీయ నేతగా, కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉన్న పీవీ నర్సింహారావును అంత దగ్గర నుంచి చూడడాన్ని ఈ ప్రాంత వాసులు ఇప్పటికీ గొప్పగా భావిస్తుంటారు. 

రేగళ్లకు రాకపోకలు..

పెళ్లయిన కొన్నేళ్ల వరకు రామకిషన్‌ బాబు-విజయ దంపతులు రేగళ్లలోనే ఉన్నారు. హైదరాబాద్‌లో పెళ్లయిన తరువాత రేగళ్లలో రిసెప్షన్‌ తదితర వేడుకలు జరిగాయి. తమ సోదరిని చూసేందుకు అప్పుడప్పుడు పీవీ కుమారులు రంగారావు, రాజేశ్వరరావు వచ్చేవాళ్లు. పీవీ కూడా కొన్నిసార్లు వచ్చారు. కొన్నేళ్ల తరువాత, పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత, డాక్టర్‌ రామకిషన్‌ బాబు-విజయ దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు. అయినప్పటికీ, సొంతూరిపై మమకారంతో డాక్టర్‌ రామకిషన్‌ బాబు దంపతులు రేగళ్లకు వస్తుండేవారు. వారికి ఇద్దరు సంతానం (కుమార్తె, కుమారుడు). తన బిడ్డ అడుగిడిన రేగళ్ల గ్రామాభివృద్ధికి ఆనాడు పీవీ కృషి చేశారు. ఆయన సహకారంతో ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మైలవరం గ్రామంలో పశు వైద్యశాల ఏర్పాటయ్యాయి. ఈ ప్రాంత వాసులు అనేకమంది, పీవీ ప్రస్తావన వస్తే చాలు.. ఇలా గర్వంగా చెప్పుకుంటుంటారు- “పీవీ సారు.. మా రేగళ్ల వియ్యంకుడు..!” అని.

అమ్మగారొస్తే ఆనందంగా ఉండేది..

నా చిన్నప్పటి నుంచి దొర ఇంట్లోనే పనిచేస్తున్నాను. డాక్టర్‌ బాబు పెళ్లికి నన్ను హైదరాబాద్‌కు బస్సులో తీసుకెళ్లారు. అప్పుడు పీవీ నర్సింహారావు సార్‌ని చూశాను. చాలా ఆనందం వేసింది. అలాంటి పెద్ద నాయకుడిని ఇప్పటివరకు అంత దగ్గరి నుంచి చూడనేలేదు. పెళ్లయ్యాక అమ్మగారు ఇక్కడికి వచ్చారు. వారితో చాలామంది పట్నం నుంచి వచ్చారు. వాళ్లందరికీ సేవ చేసే అదృష్టం నాకు కలిగింది. నాకిప్పుడు 70 సంవత్సరాలు. డాక్టర్‌ బాబు పెళ్లికెళ్లినప్పుడు నాకింకా పెళ్లి కాలేదు. ఇప్పటికీ నేను దొర ఇంట్లోనే పనిచేస్తున్నాను.

-జర్పుల వస్రాం (రాము), రామారావు దొర ఇంటి పని మనిషి

పీవీ సారును చూశాం..

 మా రేగళ్ల గ్రామానికి సోమరాజు రామారావు దొర చాలా సేవలు చేశారు. ఆ మంచి మనిషిని పీవీ సారు గుర్తించారు. తన బిడ్డను ఆ ఇంటికి కోడలిగా పంపించారు. మా గ్రామంలో అనేకరమందికి ఆయనను స్వయంగా చూసే అదృష్టం కలిగింది. రామారావు దొర కుటుంబం గురించి ఈ రోజుకీ అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఒక ప్రధాన మంత్రి బిడ్డ ఈ ఊరికి కోడలిగా రావడాన్ని మా ప్రాంత అదృష్టమేనని ఇప్పటికీ అనుకుంటాం. 

- అనంతుల సత్యనారాయణ, రేగళ్ల