మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 11, 2020 , 03:13:27

పేదలకు ఆపన్నహస్తం

 పేదలకు  ఆపన్నహస్తం

  •   విపత్కర సమయంలో కూడా ఆదుకుంటున్న ప్రభుత్వం
  •  ప్రతి ఒక్కరికీ 10 కేజీల చొప్పున రేషన్‌ బియ్యం 
  • 8400 మెట్రిక్‌ టన్నుల బియ్యం మంజూరు

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: కరోనా... విపత్కర సమయంలో కూడా ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకుంటోంది. లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఇంటింటికీ రేషన్‌ బియ్యం, రూ.1500 నిత్యావసరాలకు ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం లాక్‌డౌన్‌ పూర్తైన అనంతరం కూడా ప్రతీ ఒక్కరికీ 10 కేజీల చొప్పున రేషన్‌ బియ్యాన్ని అందిస్తూ ఆదుకుంటోంది. విపత్కర పరిస్థితుల్లో సైతం మేమున్నామంటూ ఆపన్నహస్తాన్ని అందిస్తూ నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 

 ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికీ బియ్యాన్ని అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న రేషన్‌ షాపులు, మొత్తం రేషన్‌ కార్డులు, లబ్దిదారుల సం ఖ్యకు అనుగుణంగా రేషన్‌ బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.కరోనా లాక్‌డౌన్‌ అనంతరం కూడా పనులు ఆశించిన స్థాయిలో దొరకకపోవడం, కరోనా మరింత విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం పేదల పక్షపాతిగా నిలిచి రేషన్‌ బియ్యాన్ని అందించాలనే సంకల్పంతో కేంద్రం అందిస్తు న్న 5 కేజీలతో పాటు మరో 5 కేజీలను కలిపి ఒక్కొక్కరికి 10 కేజీలు అందిస్తుంది. 

జిల్లాలో 2,83,441 రేషన్‌ కార్డుదారులకు లబ్ధి

జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్‌ అనంతరం కూడా 2,83,441 రేషన్‌ కార్డుదారులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం జిల్లాకు 8,400 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసింది. ప్రజలందరికీ జూలై 1 నుంచి రేషన్‌ అందిస్తూ వస్తున్నారు. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి రేషన్‌ అందించిన విధంగానే ఇంతటి విపత్కర సమయంలో కూడా ప్రభుత్వం పేదలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తోంది.  లాక్‌డౌన్‌ సమయంలో, అనంతరం కూడా రేషన్‌బియ్యాన్ని అందిస్తుండటంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.