మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 11, 2020 , 02:55:27

డిసెంబర్‌ 31నాటికి సాగునీరు

డిసెంబర్‌ 31నాటికి సాగునీరు

  • శరవేగంగా ‘సీతారామ’ పనులు
  • పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
  •  ప్రాజెక్టు అధికారులకు మంత్రి అజయ్‌కుమార్‌ ఆదేశం
  • సీఎంవో ప్రత్యేక కార్యదర్శిస్మితా సబర్వాల్‌తో కలిసి పనుల పరిశీలన
  • 1,2 పంప్‌హౌజ్‌ నిర్మాణాలపై  సలహాలు, సూచనలు

వచ్చే డిసెంబర్‌ 31 నాటికి సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు.. శుక్రవారం ఆయన అశ్వాపురం, ములకలపల్లి మండలాల్లో జరుగుతున్న పంప్‌హౌజ్‌ పనులను సీఎంవో   ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌, రాష్ట్ర నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు.. పనుల్లో వేగం పెంచాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. వారి వెంట ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్‌  కోరం కనకయ్య, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు ఆర్వీ కర్ణన్‌, ఎంవీ రెడ్డి, ఐటీడీఏ పీవో గౌతమ్‌ తదితరులు ఉన్నారు. 

 భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ :      సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి డిసెంబర్‌ 31 నాటికి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ అన్నారు. అధికారులతో సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడారు. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నామన్నారు. కొవిడ్‌ కారణంగా పనుల్లో జాప్యం జరిగిందని, పనుల్లో వేగం పెంచి ఆగస్టు 31 నాటికి డ్రై రన్‌ను పూర్తి చేస్తామన్నారు.  ఎనిమిది ప్యాకేజీలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశామన్నారు.  భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ఎంవీ రెడ్డితో మాట్లాడి భూ సేకరణ సమస్యలన్నింటిని పూర్తి చేస్తామన్నారు.  ఇప్పటికే రూ.3500 కోట్ల చెల్లింపులు జరిగాయని, నిర్మాణ పనుల్లో 95 శాతం మట్టి పనులు పూర్తయ్యాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయకట్టును స్థిరీకరించేందుకు సీతమ్మ బరాజ్‌ను నిర్మిస్తున్నామని, దానికి టెండర్లు కూడా ఎల్‌అండ్‌టీ సంస్థ దక్కించుకుందన్నారు. త్వరలోనే భూసేకరణ కూడా పూర్తయి పనులు ప్రారంభం అవుతాయన్నారు.

1200 ఎకరాలు సీతమ్మ బరాజ్‌కు అవసరం అవుతాయని, అటవీశాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయన్నారు. సీతమ్మసాగర్‌ పూర్తైతే 30 నుంచి 40 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందన్నారు. ఖమ్మం ఆయకట్టుతో పాటు నల్గొండ జిల్లాలో ఉన్న ఎన్నెస్పీ ఆయకట్టుకు కూడా నీళ్లు అందించవచ్చన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా సీతమ్మబరాజ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి అజయ్‌కుమార్‌ వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, రెండు  శ్రెక్టర్లు  ఆర్‌వీ కర్ణన్‌, డాక్టర్‌ ఎంవీ రెడ్డి   పాల్గొన్నారు.