బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 10, 2020 , 03:20:24

రోడ్డు ప్రమాదంలో ఆదర్శ రైతు మృతి

రోడ్డు ప్రమాదంలో ఆదర్శ రైతు మృతి

  • తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
  • కొమరారంలోవిషాదఛాయలు
  • రఘునాథపాలెం మండలంలో ప్రమాదం

రఘునాథపాలెం/ ఇల్లెందు రూరల్‌: మండుటెండల్లో శ్రమించి కాకరసాగు చేసిన రైతు.. పంటను విక్రయించేందుకు ఇంటి నుంచి బయలు దేరాడు. కానీ తిరిగి రాని లోకాలకు చేరుకున్నాడు. కుటుంబ సభ్యులకు అంతులేని విషాదాన్ని మిగిల్చాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం గ్రామానికి చెందిన బయ్య ఉప్పలయ్య (53) ఖమ్మం జిల్లా మంచుకొండ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కూరగాయల సాగులో ఆదర్శ రైతుగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. వర్షాకాలంలో తనకు ఉన్న రెండు ఎకరాల విస్తీర్ణంలో కాకర సాగు చేపట్టాడు. దిగుబడి కూడా మంచిగా రావడంతో ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు మార్కెట్లకు పంటను తరలిస్తూ విక్రయించేవాడు. బుధవారం రాత్రి కూడా యథావిధిగా కాకర పంటను విక్రయించేందుకు ట్రాలీ ఆటోలో ఖమ్మం నగరానికి బయలుదేరాడు. ఖమ్మం సమీపంలోని మంచుకొండ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని ట్రాలీ డ్రైవర్‌ జర్పుల లింగ వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ట్రాలీ లోపల కూర్చున్న ఉప్పలయ్య ముఖం నుజ్జునుజ్జయింది. అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనంలో ఉన్న డ్రైవర్‌ లింగ, జర్పుల శ్యాం, సూర అనే వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. 

తలకొరివి పెట్టిన కుమార్తె..

రైతు ఉప్పలయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది. దీంతో చిన్నకుమార్తె తలకొరివి పెట్టింది. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయి గుండెలవిసేలా రోదిస్తూ బార్య, కుమార్తెలు, బంధువులు ఉప్పలయ్యకు అంతిమ వీడ్కోలు పలికారు. 

టీఆర్‌ఎస్‌ మండల శాఖ సంతాపం

మృతిచెందిన ఆదర్శ రైతు, టీఆర్‌ఎస్‌ క్రియాశీల కార్యకర్త బయ్య ఉప్పలయ్యకు టీఆర్‌ఎస్‌ మండల శాఖ కన్వీనర్‌ ఖమ్మంపాటి రేణుక, ప్రధాన కార్యదర్శి యలమద్ది రవి నివాళులర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని అన్నారు. ఉప్పలయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.