శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 10, 2020 , 03:18:21

ఆగని గంజాయి రవాణా

ఆగని గంజాయి రవాణా

  • దందాకు కేరాఫ్‌గా భద్రాచలం
  • వరుసగా ‘మాల్‌' పట్టుబడుతున్న వైనం..
  • తాజాగా రూ.31.50 లక్షల విలువైన సరుకు పట్టివేత
  • పొరుగు రాష్ర్టాల నుంచి మన రాష్ర్టానికి సరఫరా

భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీలో గంజాయి రవాణా ఆగడం లేదు. ఈ ‘మాల్‌' దందాకు భద్రాచలం ప్రాంతం కేరాఫ్‌గా నిలుస్తున్నది. పొరుగు రాష్ర్టాల నుంచి సరఫరా అవుతున్న ఈ సరుకు భద్రాచలం మీదుగా మన రాష్ట్రంలోకి ప్రవేశస్తున్నది. పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో ఈ సరుకు వరుసగా పట్టుబడుతూనే ఉంది. గురువారం పట్టణంలో మరో రూ.31.50 లక్షలు విలువైన గంజాయిని కూడా పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ వినోద్‌ కథనం ప్రకారం.. పట్టణ ఎస్సై మహేశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు బ్రిడ్జి రోడ్డులో చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన ఓ స్విఫ్ట్‌ డీజైర్‌ కారు రోడ్డు పక్కన ఆగింది. పోలీసులు దానిని పరిశీలించగా అందులో గంజాయి ప్యాకెట్లతో కూడిన బస్తాలున్నాయి. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. మొత్తం 208 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ రూ.31.50 లక్షలు ఉంటుందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. కాగా గడిచిన ఐదు రోజుల కాలంలో మూడు కార్లలో సుమారు 646 కేజీల గంజాయిని పట్టుకున్నామని, దాని విలువ రూ.97 లక్షలు ఉంటుందని సీఐ వినోద్‌ వివరించారు.