శుక్రవారం 07 ఆగస్టు 2020
Badradri-kothagudem - Jul 09, 2020 , 02:53:34

ఆకాశంలోఅద్భుతం..

ఆకాశంలోఅద్భుతం..

  • ఇంద్రధనస్సులో భానుడు 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆకాశంలో అద్భుతం కన్పించింది. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో భానుడి ఇంద్రధనస్సు పూర్తి వలయాకారంలో కన్పించింది. ఈ దృశ్యాలను జిల్లా ప్రజలందరూ వీక్షించారు. ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉందంటూ సంభాషించుకున్నారు. ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఆవిష్కృతమైన ఆ ఇంద్రధనస్సు ఒక్కో మండలంలో ఒక్కోలా కన్పించింది. పర్ణశాల వద్ద కన్పించిన వలయంలో వేలిముద్రల వంటి గుర్తులు ఎరుపు రంగులో ఉన్నాయి. భద్రాచలం రామాలయం వద్ద కన్పించిన మరో వలయం అద్భుతంగా ఉంది. ఆ వలయం నుంచి ఓ నిలువెత్తు సూర్యకిరణం రామాలయం గర్భాలయ శిఖరంపై జాలువారినట్లుగా పడింది. గాలిగోపురం చుట్టూ ఏర్పడిన రంగుల వలయం కనువిందు చేసింది. సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సులా ఏర్పడిన వలయాన్ని ‘హ్యాలో సినామిన’ అంటారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలోని నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.                 -నమస్తే న్యూస్‌ నెట్‌వర్క్‌


logo