ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 08, 2020 , 00:04:13

పల్లెపల్లెనా హరిత పండుగ..

పల్లెపల్లెనా హరిత పండుగ..

  • జిల్లా వ్యాప్తంగా హరితహారం
  • గ్రామాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్న ప్రజలు
  •  లక్ష్యాలు నిర్దేశించుకున్న ప్రభుత్వ శాఖలు
  •  మొక్కలు నాటుతున్న అధికారులు, సిబ్బంది
  •  ఇప్పటి వరకు 30శాతం పూర్తి

పల్లె పల్లెనా ‘హరిత’పండుగ జోరందుకుంది.. సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారు.. ప్రభుత్వ శాఖల వారీగా అధికారులు, సిబ్బంది ఖాళీ స్థలాలు, రోడ్ల వెంట, ప్రభుత్వ భూముల్లో విరివిగా మొక్కలు నాటుతున్నారు.. గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. ప్రతి ఇంటిలో ఆరు మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తున్నారు.. భద్రాద్రి జిల్లాలో ఇప్పటివరకూ 30శాతం లక్ష్యం          పూర్తయింది.. త్వరలోనే పూర్తి లక్ష్యాన్ని చేరుకునే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. 


భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : తెలంగాణను హరితతెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం జిల్లాలో శరవేగంగా కొనసాగుతోంది. జూన్‌ 25న ప్రారంభమైన  తెలంగాణకు హరితహారం కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్నీ శాఖల ఆధ్వర్యంలో జరుగుతుంది. అటవీశాఖ మొదలుకొని ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి వరకు లక్ష్యాలను నిర్ధేశించుకొని అందుకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా ముందుకుసాగుతున్నారు. జిల్లా కలెక్టర్‌ ఎంవీ.రెడ్డి పర్యవేక్షణలో  హరితహారం కార్యక్రమం  1.08కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా సాగుతుంది. రానున్న రోజుల్లో వందశాతం మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.  వర్షాకాలం  కావడంతో నాటిన మొక్క బతికేలా దాని చుట్టూ కంచె ఏర్పాటు చేస్తున్నారు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో చేపట్టిన ఆరవ విడత ‘హరితహారం’ కార్యక్రమంలో ఇప్పటి వరకు 30.87 శాతం అయింది. మొత్తం 1.08కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించగా ఇప్పటి వరకు 28.86లక్షల మొక్కలను నాటారు.  ఫారెస్టుశాఖ 32,05,000 మొక్కలను నాటాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 5,73,102మొక్కలు(17శాతం), పోలీస్‌శాఖ 50వేలకు గాను 2,128(4.26శాతం), సింగరేణి 10లక్షలు నాటాలని నిర్ణయించగా 30వేలు, సెరికల్చర్‌ అండ్‌ హార్టికల్చర్‌ 3లక్షలకు గాను 2,58, 350, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ(డీఆర్‌డీఏ) 50లక్షలకు గాను 23,48, 236, నీటిపారుదలశాఖ 40వేలకు గాను 4,450, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ 1లక్ష మొక్కలకు గాను 1,850మొక్కలు, టీఎస్‌ఎఫ్‌డీసీ(కొత్తగూడెం, పాల్వంచ)4.32లక్షలకుగాను 100మొక్కలు, వ్యవసాయశాఖ ఒక లక్ష మొక్కలకుగాను 62,992మొక్కలు, పరిశ్రమలశాఖ 50వేలకు గాను1,463 మొక్కలు, పాఠశాల విద్య ఆధ్వర్యంలో 30 వేలకు గాను 18,003, ఐటీడీఏ (ట్రైబల్‌ వెల్ఫేర్‌) 6,270 మొక్కలకు గాను   6,978 మొక్కలు (111 శాతం), బీసీ వెల్ఫేర్‌శాఖ 1,000 మొక్కలకు 1,050 మొక్కలు, ఎస్సీ హాస్టల్స్‌ 1,000మొక్కలకుగాను 727మొక్కలు, కొత్తగూడెం మున్సిపాలిటీ 2 లక్షలకు గాను 6,887మొక్కలు, ఇల్లెందు మున్సిపాలిటీ 75వేలకు గాను 16,940 మొక్కలు, మణుగూరు మున్సిపాలిటి లక్ష మొక్కలకు గాను 19,725మొక్కలు, పాల్వంచ మున్సిపాలిటీ లక్ష మొక్కలకు గాను 30,850 మొక్కలు, మార్కెటింగ్‌శాఖ 5వేలకు గాను 2,900, ఆరోగ్యశాఖ 6వేలకు గాను 4,168, స్త్రీ, శిశుసంక్షేమశాఖ 6వేలకు 4,135మొక్కలు, పంచాయతీరాజ్‌ 500లకు గాను 400, రెవెన్యూశాఖ వెయ్యి మొక్కలకు గాను 1029 (102శాతం), జిల్లా కో-ఆపరేటివ్‌శాఖ ఆధ్వర్యంలో 5వేలకుగాను 3,664, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ 5వేలకుగాను 790మొక్కలు నాటారు.  

తెలంగాణ మెడలో పచ్చనిహారాన్ని తొడిగేందుకు జిల్లా ప్రజలు,అధికారులు,ప్రజాప్రతినిధులు సంసిద్ధులయ్యారు. నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకున్నారు.  ఆరవ విడత హరితహారంలో కూడా 1.08కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్దేశించుకొని ముందుకు సాగుతుండటంతో రాబోయే రోజుల్లో జిల్లా హరిత భద్రాద్రిగా అవతరించనుంది. 

లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : రంజిత్‌నాయక్‌, డీఎఫ్‌ఓ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ఇప్పటికే నర్సరీల్లో నాటడానికి, ప్రజలకు పంపిణీ చేసేందుకు కావాల్సినన్ని మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. జిల్లా కలెక్టర్‌ ఎంవీ.రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 30 శాతం మొక్కలను నాటాం. మిగిలిన మొక్కలను నాటి లక్ష్యాన్ని పూర్తి చేసి, మొక్కలను సంరక్షించే చర్యలు చేపడతాం. ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతానికి తమ శాఖ ప్రణాళికబద్ధంగా ముందుకుసాగుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతోంది.