శనివారం 08 ఆగస్టు 2020
Badradri-kothagudem - Jul 07, 2020 , 03:32:45

అవినీతికి అడ్డాగా ప్రైవేటు కార్యాలయాలు

అవినీతికి అడ్డాగా ప్రైవేటు కార్యాలయాలు

  • నిత్యం అక్కడి నుంచే విధులు

  • ఖాళీగా దర్శనమిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు

ఇల్లెందు రూరల్‌: పూర్తిస్థాయిలో కాకపోయినా ఉన్నంతలో ప్రభుత్వ కార్యాలయాలు విధుల నిర్వహణకు సౌకర్యాంగానే ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం, ప్రభుత్వం అప్పగించిన పనులు పూర్తిచేసేందుకు ఈ కార్యాలయాలను అధికారులు ఉపయోగించాలి. కానీ క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు. పలు కీలక శాఖల అధికారులు ప్రైవేటు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని,

దర్జాగా అవినీతికి తలుపులు బార్లా తెరిచారు. ఇటీవల, తాజాగా జరిగిన ఏసీబీ దాడులే దీనికి ప్రత్యక్ష నిదర్శనాలు. ఇరిగేషన్‌ ఏఈ నవీన్‌ ప్రభుత్వ కార్యాలయాన్ని పక్కన పెట్టి ప్రైవేటుగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడే కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. నాలుగు నెలల క్రితం మున్సిపల్‌ ఏఈ బాబు కూడాతన  ప్రైవేటు గదిలో కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విషయం పాఠకులకు తెలిసిందే. అడిగినంత లంచం ఇస్తే చాలు.. పనులు పూర్తవకపోయినా కూడా పూర్తయినట్లుగా రికార్డుల్లో చూపించి, బిల్లులు మంజూరు చేయిస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రెవెన్యూ శాఖలోనూ కొందరు ప్రైవేటు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో వీఆర్వోలకు ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. నిర్దేశిత తేదీలు, అత్యవసర సమయాల్లో తప్ప వీఆర్వోలు తమకు కేటాయించిన క్లస్టర్‌లోనే విధులు నిర్వహించాలి. కానీ చాలామంది వీఆర్వోలు ప్రైవేటు గదుల్లో ‘పనులు చక్కబెడుతున్నార’ని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఇతర శాఖల్లోనూ ఇలాగే ఉంది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే.. ఏసీబీకి పని ‘భారం’ పెరిగినా పెరగొచ్చు...!


logo