శుక్రవారం 07 ఆగస్టు 2020
Badradri-kothagudem - Jul 07, 2020 , 03:29:11

అడ‌విలో దొంగ‌లు ప‌డ్డారు

అడ‌విలో దొంగ‌లు ప‌డ్డారు

  • స్మగర్ల చేతిలో నేలకూలిన భారీ వృక్షాలు 
  •  రూ.10 లక్షల విలువైన కలప తరలింపు
  •  విధి నిర్వహణలో అటవీ సిబ్బంది ఆదమరుపు

అశ్వారావుపేట: అడవుల సంరక్షణ కోసం ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా అటవీ శాఖాధికారుల నిర్లక్ష్యంతో స్మగ్లర్లు చెలరేగిపోతున్నాన్నారు. లక్షల రూపాయల విలువైన భారీ వృక్షాలను నరుక్కుని తీసుకెళ్తున్నారు. నాలుగు రోజుల క్రితం అశ్వారావుపేట మండలం ఆసుపాక సమీపంలోని అటవీ ప్రాం తంలో స్మగ్లర్ల చేతిలో నాలుగు భారీ వృక్షాలు నేలకూలాయి. వీటిలో మూడు చెట్ల కలపను ప్రత్యేక వాహనంలో తరలించుకుపోయారు. మరో భారీ వృక్షాన్ని తరలించేందుకు సాధ్యం కాకపోవటంతోఅక్కడే వదిలేశారు.

ఒక్క చెట్టు.. మూడులక్షలు..

మండలంలోని ఆసుపాక సమీపంలో గాడ్రాల క్రాస్‌ రోడ్డుకు అతి దగ్గరలోని అడవిలో నాలుగు రోజుల క్రితం కొందరు స్మగర్లకు కలప వ్యాపారం కోసం నాలుగు భారీ వృక్షాల(నార వేప చెట్ల)ను యంత్రాలతో కోశారు. ఒక్కొక్క చెట్టు సుమారు 50 నుంచి 60 అడుగుల పొడవు ఉంది. చెట్టు కైవారమే 8 నుంచి 9 అడుగుల వరకు ఉంది. వీటిలో మూడు చెట్లను దుంగలుగా చేసి వాహనంలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు తరలించారు. అందిన సమాచారం ప్రకారం... ఒక్కో చెట్టును 7 అడుగుల చొప్పున 7 నుంచి 8 దుంగలుగా నరికి తరలించారు. స్మగ్లర్లు అడుగు కలపను రూ.1,800 నుంచి రూ.2000 వరకు బయట మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఒక్కో చెట్టు నుంచి సుమారు 125 నుంచి 150 అడుగుల కలపను సేకరించారు. ఈ లెక్కన ఒక్క చెట్టు ద్వారా రూ.2.25 లక్షల నుంచి రూ.3.00 లక్షల వరకు సొమ్ము చేసుకున్నారు. మూడు చెట్ల ద్వారా స్మగ్లర్ల ఆర్జన రూ.6.75 నుంచి రూ.9.00 లక్షల వరకు ఉంటుందని అంచనా. నార వేపను జిట్రేగి కలపగా స్మగ్లర్లు నమ్మించి అడుగు రూ.5000కు పైగానే విక్రయిస్తున్నారు. మరో చెట్టును తరలించేందుకు అప్పటికప్పుడు సాద్యం కాక స్మగ్లర్లు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీని విలువ కూడా రూ.2.50 లక్షల నుంచి రూ.3.00 లక్షల వరకు ఉంటుందని అం చనా.

మొద్దు నిద్రలో అటవీ అధికారులు..

ఇది జరిగి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ అటవీ శాఖాధికారులు మొద్దు నిద్ర నుంచి మేల్కొనలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటవీ శాఖలో జరిగిన కొన్ని అక్రమాలపై విచారణ నిర్వహించిన విజిలెన్స్‌ బృందం నివేదిక ఆధారంగా కొద్ది రోజుల క్రితం రేంజర్‌తోపాటు డీఆర్వో, బీట్‌ ఆఫీసర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. కనీసం పక్షం రోజులు కూడా గడవక ముందే మరో దోపిడీ చోటు చేసుకోవడాన్నిబట్టి అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం ఏ స్థాయిలో తేలిగ్గానే ఊహించవచ్చని వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. అంతరిస్తున్న అడవుల సంరక్షణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. అడవుల పునరుద్ధరణకు హరితహారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కానీ, దీనికి విరుద్ధంగా అటవీ శాఖ అధికారులు వ్యవ హరిస్తున్నారని, అటవీసంపద దోపిడీని అడ్డుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

దీని మర్మమేమిటో...!

కలప అక్రమ రవాణాను నియంత్రించేందుకు అటవీ శాఖ చెక్‌పోస్ట్‌లు, టాస్క్‌ఫోర్స్‌, బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రత్యేక సిబ్బందిని నియమించింది. అయినప్పటికీ కలప అక్రమ రవాణా, వన సంపద దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. దీని మర్మమేమిటో...?! ఈ విషయమై వివరణ కోరేందుకు ఇన్‌చార్జ్‌ రేంజర్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ను ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించినా స్పందించలేదు.


logo