ఆదివారం 09 ఆగస్టు 2020
Badradri-kothagudem - Jul 05, 2020 , 03:37:35

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీవర్షం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీవర్షం

  • చెరువులు, వాగుల్లో చేరిన వరదనీరు

భద్రాద్రి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.. అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, పాల్వంచ మండలాల్లో తీవ్రత ఎక్కువగా కనిపించింది.. ఏకధాటిగా కురిసిన వర్షానికి పలు చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరింది.. పొలాల్లోకి నీరు చేరి జలకళను సంతరించుకున్నాయి.. కొన్నిచోట్ల ఈదురుగాలులు వచ్చి పశువుల పాకలు, ఇంటి పై కప్పులు లేచి కింద పడ్డాయి.. దమ్మపేట పంచాయతీ పరిధిలోని మామిళ్లయ్యవారి కుంట, రావువారి కుంట, నందంవారికుంటల్లోకి భారీగా వరద నీరు చేరింది. మామిళ్లయ్యవారికుంటలో నీరు బాగా చేరడంతో స్థానికులు చేపలు పడుతూ సందడి చేశారు. పాల్వంచ పరిధిలోని మొర్రేడు వాగు మత్తడి పోసింది.                             - నమస్తే తెలంగాణ 

చండ్రుగొండ/ అన్నపురెడ్డిపల్లి/ దమ్మపేట/ అశ్వారావుపేట టౌన్‌/ పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యాప్తంగా శనివారం జోరువాన కురిసింది. నీలిమబ్బు కురులు విడిచి నాట్యం చేసిందా అన్నట్లుగా శుక్రవారం రాత్రి జల్లులుగా మొదలైన వర్షం.. శనివారం ఉదయం జోరువానగా మారింది. సాయంత్రం వరకూ కురుస్తూనే ఉంది. అశ్వారావుపేట నియోజకవర్గంలో పొలాల్లోకి నీరు చేరడంతో అవి చెరువులను తలపిస్తున్నాయి. ఇక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాల్వంచ మండలంలో మొర్రేడువాగులో వరదనీరు భారీగా ప్రవహిస్తున్నది. చండ్రుగొండ మండలంలో 49.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలై మొదటి వారంలో వానలు పుష్కలంగా పడటం రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. వాగులు, పొలాల్లో యువకులు, మహిళలు వలలతో చేపలను పట్టే పనుల్లో నిమగ్నమయ్యారు. వానబీభత్సానికి చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో రైతు అంచ కృష్ణ పశువుల రేకుల షెడ్డు కూలిపోయింది. సిమెంటు రేకుల మొత్తం పగిలిపోయాయి. దమ్మపేట మండలలో మామిళ్లయ్యవారి కుంట, రావువారి కుంట, నందంవారికుంటలు వరదనీటితో పొంగి పొర్లుతున్నాయి. పాల్వంచలో శనివారం 34.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరింది. logo