బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 02, 2020 , 00:32:13

సమ్మెను విజయవంతం చేయండి..

సమ్మెను విజయవంతం చేయండి..

  • నేడు సింగరేణిలో 24 గంటల నిరసన 
  • టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు

మణుగూరు రూరల్‌ : కేంద్ర ప్రభుత్వ తీసుకున్న బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సింగరేణిలో చేపట్టే 24 గంటల సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు పిలుపునిచ్చారు. బుధవారం సింగరేణి ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో ఆయన మణుగూరు ఏరియా టీజీబీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా, అనాలోచితంగా తీసుకున్న బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే నిరవధిక సమ్మెకైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దేశంలో ఉన్న 50 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం జూన్‌ 18 నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగా తొలుత 42 బ్లాకులకు ఈ-ఆక్షన్‌ ప్రారంభించిందని దీనిని కార్మికులందరూ ఐక్యంగా సమ్మెలో పాల్గొని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ చేస్తే కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు దాపురిస్తాయని, వేజ్‌బోర్డు, రక్షణ సౌకర్యాలు, జీతాల్లో పెరుగుదల నిలిచిపోతాయన్నారు. పనిగంటల్లో మార్పులు వస్తాయన్నారు.  సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం అధిక శాతం ఉన్నా కేంద్రం మాత్రం ఏకపక్షంగా ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నదన్నారు.   

దశలవారీగా...

సీఎం కేసీఆర్‌ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను జరుగనివ్వబోమని హామీనిచ్చారని వెంకట్రావు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తొలుత కార్మికులంతా ప్రైవేటీకరణను నిరసిస్తూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై అన్నిగనుల్లో అధికారులకు మెమొరాండం ఇచ్చారని, జూన్‌ 26వ తేదీన సింగరేణివ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశామన్నారు. గురువారం ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చామన్నారు.  టీబీజీకేఎస్‌ తలపెట్టిన ఒక్కరోజు సమ్మె ఒక హెచ్చరిక మాత్రమేనన్నారు. అయినా కేంద్ర నిర్ణయాన్ని, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని, అందుకు చేస్తున్న ప్రయత్నాలను వెనక్కి తీసుకోకుంటే నిరవధిక సమ్మెకు కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. స్వచ్ఛందంగా కార్మికులంతా గురువారం సమ్మెలో పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో లెవన్‌మెన్‌ కమిటీ మెంబర్‌ సామా శ్రీనివాసరెడ్డి, అబ్దుల్‌ రవూఫ్‌, కోటా శ్రీనివాసరావు, వీరభద్రయ్య, అశోక్‌ పాల్గొన్నారు.