శుక్రవారం 04 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 02, 2020 , 00:16:16

ఇల్లెందు ఏరియాకు కరోనా ఎఫెక్ట్‌

ఇల్లెందు ఏరియాకు కరోనా ఎఫెక్ట్‌

  • నిలిచిపోయిన భారీ బొగ్గు నిల్వలు 
  • రైల్వే, రోడ్డు ట్రాన్స్‌పోర్టుపై ప్రభావం 
  • ఏపీ, మహారాష్ట్రలకు నిలిచిన బొగ్గు రవాణా 
  • 6.5 లక్షల టన్నుల బొగ్గు నిల్వలకు బ్రేక్‌  

ఇల్లెందు: కరోనా ఎఫెక్ట్‌ ఇల్లెందు ఏరియాపై తీవ్రంగా పడింది. ఉత్పత్తిలో ఇల్లెందు ఏరియా ప్రతి నెలా ముందు వరుసలో ఉంటున్నది. ఏటా అగ్రభాగానా నిలుస్తున్నది. అయితే కరోనా నేపథ్యంలో మూడు నెలల నుంచి ఇల్లెందు ఏరియాలో బొగ్గు రవాణాకు బ్రేక్‌ పడింది. రైలు, రోడ్డు ట్రాన్స్‌పోర్టులు నిలిచిపోవడంతో బొగ్గు నిల్వలు ఎక్కడికక్కడ పేరుకపోయాయి. సింగరేణిలో ఇల్లెందు ఏరియా చిన్నదే అయినప్పటికీ సంస్థకు కీలకమైనది. ఏరియాలో ఒక అండర్‌ గ్రౌండ్‌ మైన్‌ ఉన్నప్పటికీ అది నామమాత్రమే. బొగ్గు పెళ్ల కూడా అండర్‌ గ్రౌండ్‌ నుంచి బయట పడేది లేదు. కేవలం రెండు ఓసీల మీదనే ఏరియా మనుగడ కొనసాగుతూ వస్తున్నది. ఒకటి జేకే5. రెండోది కేవోసీ. వీటిల్లో ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతునప్పటికీ ట్రాన్స్‌పోర్టు విషయంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు మూడు, నాలుగు రేకులు (వ్యాగన్లు) ఇల్లెందు ఏరియా నుంచి రవాణా జరుగుతుండేవి. మార్చి నుంచి రవాణా లేకపోవడంతో బొగ్గు నిల్వలు పేరుకపోయాయి. ఇల్లెందు ఏరియా బొగ్గును ఏపీ, మహారాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏపీలోని విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వీటీపీఎస్‌), రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు మద్దునూరు (ఆర్‌టీపీపీ)తోపాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ ఎస్‌టీపీఎస్‌, కేఆర్‌డీఎస్‌, మహాజెన్‌కో పర్లీ విద్యుత్‌ సంస్థలు ఇల్లెందు ఏరియా బొగ్గును కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మహారాష్ట్రలో కరోనా ఇప్పటికీ విజృంభిస్తుండడంతో అక్కడికి బొగ్గు రవాణా చేయడం కష్టసాధ్యంగా మారింది. అయినప్పటికీ ఇటీవల కొంతమేర రవాణా చేశారు. ఇల్లెందు ఏరియాలో భారీగా బొగ్గు నిల్వలు పేరుకపోయాయి. ప్రస్తుతం ఇల్లెందు ఏరియాలో 6,50,969 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలను వీలైనంత త్వరగా ఏపీ, మహారాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు తరలించే విధంగా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకుంటున్నది. సాధారణంగా అయితే నెలకు 10,15,452 టన్నులను రైల్వే మార్గం ద్వారా, 1,82,110 టన్నులను రోడ్డు మార్గం ద్వారా రవాణా చేయాల్సి ఉంది. 

రవాణాను వేగవంతం చేస్తాం 

లాక్‌డౌన్‌ కారణంగా ఇల్లెందు ఏరియాలో రవాణాకు అంతరాయం ఏర్పడింది. త్వరలో ఆ సమస్యను అధిగమిస్తాం. వీలైనంత త్వరగా ఎక్కువ రవాణా చేసేందుకు ప్రణాళిక రూపకల్పన చేస్తున్నాం. అవసరమైతే అదనంగా రేకులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఏపీ, మహారాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు కావాల్సినంత బొగ్గును సరఫరా చేస్తాం. 

-పీవీ సత్యనారాయణ, జీఎం, ఇల్లెందు ఏరియా