ఆదివారం 05 జూలై 2020
Badradri-kothagudem - Jul 01, 2020 , 01:10:06

పట్టణాభివృద్ధికి వందకోట్లు కేటాయింపు

పట్టణాభివృద్ధికి వందకోట్లు కేటాయింపు

  • కొత్తగూడెం-పాల్వంచను సుందరంగా తీర్చిదిద్దుతా..
  • పట్టణానికి స్వాగత ద్వారాల ఏర్పాటు
  • ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

కొత్తగూడెం అర్బన్‌: కొత్తగూడెం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా వందకోట్లు కేటాయించారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఎజెండాలోని  పలు అంశాలను చర్చించి కౌన్సిలర్ల ఏకాభిప్రాయం మేరకు ఆమోదించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కొత్తగూడెం-పాల్వంచ పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, రెండు పట్టణాల్లో వందల కోట్ల నిధులను వెచ్చించి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. మున్సిపాలిటీ బోర్డర్‌లైన రామవరం, పాతబస్‌ డిపో, బాబుక్యాంపుల వద్ద మొత్తం మూడు  స్వాగత ద్వారాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరవ ‘హరితహారం’లో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 5.20లక్షల మొక్కలను నాటనున్నామని తెలిపారు. రామవరం నుంచి పాల్వంచ పెద్దమ్మతల్లి దేవాలయం వరకు సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సంవత్సరం చివరిలోగా ఇళ్ల పట్టాలన్నింటిని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.  సమావేశంలో  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ వేల్పుల దామోదర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అరిగెల సంపత్‌కుమార్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 


logo