బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jun 29, 2020 , 02:24:37

టీబీ నియంత్రణలో టాప్‌ ‘భద్రాద్రి’

టీబీ నియంత్రణలో టాప్‌ ‘భద్రాద్రి’

  • వైద్యారోగ్య శాఖ ర్యాంకింగ్‌లో మొదటి స్థానం కైవసం
  • బాధితులకు మెరుగైన సేవలు అందించడంతో గుర్తింపు
  • ఆరోగ్య సిబ్బందికి  అభినందనల వెల్లువ

కొత్తగూడెం: టీబీ నియంత్రణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిపారు ఆ జిల్లా వైద్యాధికారులు. వైద్యారోగ్య శాఖ చేసిన ర్యాంకుల ఆధారంగా టీబీ నియంత్రణలో భద్రాది జిల్లా వైద్యారోగ్య శాఖకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ భాస్కర్‌ నాయక్‌, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, వైద్యులు, సిబ్బంది సమష్టిగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. క్షయ వ్యాధి గుర్తింపు, ప్రతి రోగికి టీబీ నాట్‌ పరికరం ద్వారా పరీక్ష చేయడం, హెచ్‌ఐవీ.. షుగర్‌ పరీక్షలు నిర్వహించడం, మందులు సక్రమంగా ఇవ్వడం.. వీటన్నింటిలో లక్ష్యాన్ని వంద శాతం సాధించి జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చారు.

జిల్లాలో 1100 మంది వ్యాధిగ్రస్తులు..

మన జిల్లాలో ఇప్పటికి 1100 మందికి టీబీ సోకినట్లుగా వైద్యశాఖ గుర్తించింది. సాధారణ కేసులు  1051, మొండి కేసులు 49 ఉన్నట్లుగా గ్రహించింది. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, ఆశ్వాపురం, మణుగూరు, పినపాక, సులానగర్‌, దమ్మపేట, ఆశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు, రొంపేడు, కరకగూడెం ఏరియాల్లో తెమడ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. మందులు పంపిణీ చేసే కేంద్రాలు జిల్లాలో 17 చోట్ల ఉన్నాయి.

రెండు చోట్ల సీబీ నాట్‌ పరీక్షలు..

టీబీ వ్యాధిని గుర్తించడానికి మన జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం ఏరియా ఆసుపత్రుల్లో అవకాశముంది. ‘సీబీ నాట్‌' అనే పరీక్ష ద్యారా మొండి టీబీని ఇక్కడ గుర్తిస్తున్నారు.     కేవలం రెండు గంటల్లో పరీక్షలు చేసి వెంటనే వైద్యం అందిస్తున్నారు. ప్రతి పీహెచ్‌సీలో కూడా తెమడ పరీక్షలు చేసే పరికరాన్ని ఏర్పాటు చేశారు. దాని వల్ల టీబీ రోగులకు దూరా భారం తగ్గనుంది. జిల్లాలో ప్రతి ఏటా రోగులను సర్వే చేసి వారికి మందులు ఇవ్వడంతోపాటు, టీబీ వ్యాధి గ్రస్తులకు నెలకు రూ 500 పారితోషకం ఇవ్వడంలో కూడా ముందు వరసలో నిలవడం జిల్లా తొలిస్థానానికి చేరుకుంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన నిక్షయ వెబ్‌సైట్‌లో కూడా రోగుల వివరాలు అందుబాటులో ఉంచింది.