శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 28, 2020 , 02:38:34

‘డీటీసీపీ’ లే-అవుట్‌ ప్రకారమే వెంచర్లు వేయాలి

‘డీటీసీపీ’ లే-అవుట్‌ ప్రకారమే వెంచర్లు వేయాలి

  • ‘సుడా’ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • ప్లాట్ల క్రమబద్ధీకరణకు ‘ఎల్‌ఆర్‌ఎస్‌' సదవకాశం
  • వెంచర్‌ యాజమాన్యాల సమావేశంలోసుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌
  • మండలంలో 99శాతం అక్రమ వెంచర్లపై మండిపాటు

రఘునాథపాలెం : డీటీసీపీ లే అవుట్‌ అప్రూవల్‌ లేకుండా వెంచర్లు చేస్తే ఉపేక్షించేది లేదని స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సుడా) చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌ రియల్‌ ఎస్టేట్‌ యజమానులను హెచ్చరించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ మేళాలో భాగంగా శనివారం రఘునాథపాలెం మండల పరిషత్‌ కార్యాలయంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ప్రజాప్రతినిధులతో చైర్మన్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రఘునాథపాలెం మండల పరిధిలో 95శాతం వెంచర్లు ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉండకూడదని హెచ్చరించారు. అక్రమ వెంచర్లను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. అదే క్రమంలో ప్లాట్ల రాళ్లు సైతం తొలగించాలని గ్రామ కార్యదర్శులను చైర్మన్‌ ఆదేశించారు. ఇప్పటివరకు ఏర్పాటైన వెంచర్లలోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పక చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సమావేశానికి గైర్హాజరు కావడంపై మండిపడ్డారు. ముందుగా హరితహారంలో భాగంగా కార్యాలయం ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకోవడానికి మరోమారు అవకాశాన్ని కల్పించిందని సుడా సీవో రవీందర్‌ర్‌రెడ్డి   అన్నారు. దీనిప్రకారం 2018 మార్చి 30వ తేదీకి ముందు వరకు ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారందరూ  అర్హులన్నారు. ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, సుడా డైరెక్టర్‌ అజ్మీరా వీరూనాయక్‌, ఎంపీడీవో అశోక్‌ కుమార్‌, ఎంపీపీ గౌరి, జెడ్పీటీసీ ప్రియాంక, తహసీల్దార్‌ నర్సింహారావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్‌, దిశ కమిటీ సభ్యుడు మెంటెం రామారావు తదితరులు పాల్గొన్నారు.