గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 28, 2020 , 01:55:38

అంతంత మాత్రంగా అంతిమ యాత్రలు

అంతంత మాత్రంగా అంతిమ యాత్రలు

  • కరోనా నేపథ్యంలో  కడసారి వీడ్కోలును కన్నీటితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి
  • అతి తక్కువ మంది మధ్యనే 
  • దహన సంస్కారాలు
  • ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై 
  • ‘నమస్తే’ ప్రత్యేక కథనం

 ‘ఒక మనిషి చనిపోతాడు.. తనను   చూడటానికి ఎక్కువ మంది రావాలని ఆశిస్తాడు.. వేనోళ్లు తన సేవలు కీర్తించాలని   ఆశపడతాడు.. చివరికి నలుగురైనా తన పాడె మోయాలని కోరుకుంటాడు..’ ఓ సినిమాలో కథానాయకుడు.. అప్పట్లో ఆ చిత్రం ఓ సంచలనం.   దాని పేరు ‘ఆ నలుగురు’. చివరకు వందలు, వేల సంఖ్యలో జనం తన అంతిమయాత్రకు వస్తారు.. తాను ఊహించిన దానికంటే ఎక్కువ మంది నుంచి స్పందన కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అది కేవలం ఊహకే పరిమితమా..? అనే పరిస్థితి నెలకొంది.. కరోనా నేపథ్యంలో ‘ఆ నలుగురు.. నుంచి      ఆ నలుగురే..’ అన్న పరిస్థితి వచ్చింది.

-భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: ఏ ఊర్లోనైనా ఒక మనిషి చనిపోతే ఊరూరంతా కదలి వస్తారు.. హీన పక్షం వాడ వాడంతా కదిలివస్తుంది.. కడసారి చూపు చూసి అతను చేసిన మంచి పనులను తలుచుకొని అతని మంచిని వేనోళ్ల కీర్తిస్తుంది. నేడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు జరుగుతున్న అంతిమ సంస్కారాల తంతు బతికున్నప్పుడు దానధర్మాలు చేసినా, ఎంగిలిచేయితో కాకిని కొట్టకపోయినా అతను ఎటువంటి వ్యక్తి అయినా నేడు పట్టుమని పది మంది కూడా లేకుండానే.. ఊరేగింపు జరగకుండానే నిరాడంబరంగా ఇంటిల్లిపాది మాత్రమే పాల్గొని చావుతంతును ముగించాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్న పెద్ద దిక్కును కోల్పోయినా లేక పిల్లలు మరణించినా అదే పరిస్థితి. కడసారి చూపు చూసి ఏడ్చేందుకు సైతం తమ వారు రాక కేవలం ఇంట్లో ఉన్న నలుగురే కుమిలిపోతూ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తుంది. అనంతరం జరిగే కర్మకాండలకు కూడా ఎవరూ రాని దయనీయ పరిస్థితి నెలకొంది. కడసారి చూపు చూసి ఆ అంత్యక్రియల్లో పాల్గొంటే ఎంతో పుణ్యం వస్తుందని ప్రజల నమ్మకం. అటువంటి చావు ‘కరోనా’ దెబ్బతో నేడు జనంలేక వెలవెలబోతోంది. అతి కొద్ది మందితోనే దహనసంస్కారాలు పూర్తి చేయాల్సిన దౌర్భాగ్యం దాపురించింది.

దుఃఖ సమయంలోనూ..

కరోనా మహమ్మారి ఎంతలా మానవ జీవితాలను మార్చివేసింటే పెళ్లయినా, చావు అయినా, ఇంక ఏ ఇతర శుభకార్యమైనా అతితక్కువ మందితో ముగించేలా చేసింది. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుండటంతో పెళ్లిళ్లు సైతం కొందరి మధ్యే జరుపుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో? కరోనా ఎప్పుడు అంతమవుతుందో..? తెలియని పరిస్థితి. మార్చిలో జరిగిన జనతా కర్ఫ్యూ నుంచి లాక్‌డౌన్‌ వరకు మనిషి చనిపోయినా బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా పరపతి, ఆర్థిక వనరులను బట్టి చావును కూడా షామియానాలు పెట్టి, బాంబులు కాల్చి తమ ఆత్మీయునికి వీడ్కోలు పలికే సంస్కృతి మన సమాజంలో ఉంది. ఎవరి స్తోమతను బట్టి వారు ఈ తంతు కొనసాగిస్తారు. పరిమిత సంఖ్యలోనే బంధువులు, స్నేహితులు హాజరు కావాలని చెప్పడంతో నిరాడంబరంగా అంతిమయాత్రలు సాగుతున్నాయి. వారి వారి ఆచారాల ప్రకారం మృతదేహాలను దహనం చేసినా, శవపేటికల్లో పెట్టి పూడ్చినా, మట్టిలో పాతినా కాటి వరకు మాత్రం కొందరే తోడు వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

మారిన కర్మకాండల విధానం..

పుట్టిన వాడు గిట్టక మానడు అనేది భగవద్గీత మాట.. ఇతర మత గ్రంథాల్లోనూ దాదాపు ఇదే రకంగా తాత్వికత ఉంటుంది. దీనిలో భాగంగానే ఎవరి ఆచారాల ప్రకారం వారు చనిపోయిన తమ ఆత్మీయుల ఖర్మకాండలు జరుపుకోవడం పరిపాటి. హన సంస్కారాల అనంతరం మూడవ రోజు, ఐదవ రోజు, తొమ్మిదవ రోజు, 11వ రోజు అని, ఎవరి సంప్రదాయం ప్రకారం వారు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం కరోనా వ్యాపిస్తున్న క్రమంలో పరిమిత సంఖ్యలో బంధువుల మధ్య ఈ తంతు కొనసాగుతున్నది. దూర ప్రాంతాల్లో ఉన్న వారు ఇక్కడికి రాలేకపోవడం లేదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు ఇక్కడ ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

 మరోవైపు కరోనా  భయం..

కరోనా సోకి చనిపోయినా, లేదా సాధారణ కారణాలతో చనిపోయినా అత్యంత ఆప్తులు సైతం దగ్గరకు రాలేని పరిస్థితి నెలకొంది. సాధారణ కాలంలో అయితే తమ ఆత్మీయులు చనిపోతే మృతదేహం వద్దకు వచ్చి బోరున ఏడ్చే సందర్భాలను మనం చూశాం. బాధతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఓదార్చుకున్న ఘటనలూ సహజమే. కానీ ఇప్పుడు భౌతికదూరం పాటించాల్సిన నేపథ్యంలో మృతదేహానికి, ఆత్మీయులకు దూరంగానే నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. దీర్ఘకాలిక జబ్బులు లేదా ఇతర ప్రాంతాల్లో వైద్యం తీసుకుంటూ చనిపోయిన వారి అంతిమయాత్రకు వెళ్లడానికి ఇంక ఎక్కువ భయపడేలా పరిస్థితులు ఉన్నాయి. సాధారణంగా ఏదైనా ఒక కాలనీలో మరణం సంభవిస్తే నేరుగా ఆ ఇంటికి వెళ్లి పరామర్శించే వారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.