బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 25, 2020 , 04:13:35

ఉమ్మడి జిల్లాలో రెండు మరణాలు, మరో ఎనిమిది కరోనా కేసులు

  ఉమ్మడి జిల్లాలో రెండు మరణాలు, మరో ఎనిమిది కరోనా కేసులు

  • ఐసోలేషన్‌కు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు 

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మయూరిసెంటర్‌/ ముదిగొండ/ లక్ష్మీదేవిపల్లి/ ఇల్లెందు: ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్‌ కలవరం సృష్టిస్తున్నది. బుధవారం ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో రెండు మరణాలు కూడా సంభవించాయి. ఖమ్మానికి చెందిన ఓ వ్యక్తి, ముదిగొండకు చెందిన మరో చిన్నారి చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతిచెందారు. ఖమ్మం డీఆర్‌డీఏ సమీపంలోని ఆంధ్రాబ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్న 59 ఏళ్ల వ్యక్తికి బీపీ, షుగర్‌తోపాటు, ఆయాసం దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉన్నాయి. చికిత్స కోసం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో అతణ్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 23న మృతిచెందాడు. అలాగే ముదిగొండకు మూడు నెలల చిన్నారికి పుట్టుకతోనే ఫిట్స్‌ ఉన్నాయి. పది రోజుల క్రితం ఆరోగ్యం బాగలేకపోవటంతో ఆ చిన్నారిని తల్లిదండ్రులు ముదిగొండ పీహెచ్‌సీలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి చిన్నారికి మెదడు వాపుతోపాటు కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పారు. జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు. కానీ తల్లిదండ్రులు ఖమ్మం రాకుండా, వైద్యులకు చెప్పకుండా వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి కరోనా పరీక్ష కోసం నమూనాలు సేకరించారు. అనంతరం చికిత్స అందిస్తుండగానే ఈ నెల 23న చిన్నారి మృతిచెందాడు. అదే రోజు రాత్రి ముదిగొండ వచ్చి చిన్నారిని ఖననం చేశారు. బుధవారం మధ్యాహ్నం వచ్చిన రిపోర్టులో ఆ చిన్నారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని ముదిగొండ పీహెచ్‌సీ వైద్యుడు దర్మేంద్ర తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆరుగురు కుటుంబ సభ్యులకు కరోనా లక్షణాలు లేకపోయినా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తిస్తున్నారు. కాగా మంగళవారం రెండు కరోనా మరణాలు సంభవించినట్లయింది. 29న మధిరలో తొలి మరణాన్ని కలుపుకొని జిల్లాలో మొత్తం కరోనా మరణాల సంఖ్యకు మూడుకు చేరింది. 

భద్రాద్రిలో ఏడుగురికి,  ఖమ్మంలో ఒకరికి పాజిటివ్‌..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావును కలిసిన 49 ఏళ్ల ఓ ప్రైవేటు వైద్యుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ వైద్యుడిది ఖమ్మం కవిరాజ్‌నగర్‌ అని వైద్యులు తెలిపారు. కాగా వీహెచ్‌ ప్రైమరీ కాంటాక్టుల్లో ఆందోళన మొదలైంది. అలాగే లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పెద్దతండాలో ఇంకో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అతడితో కలిసి ఆటోలో ప్రయాణించిన వారిని అధికారులు గుర్తించి వారి ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. వారిని హోంక్వారంటైన్‌ చేశారు. అలాగే ఖమ్మం ఎన్‌ఎస్‌టీ రోడ్డులో 60 ఏళ్ల మహిళకు కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇల్లెందు 24 ఏరియాలో సింగరేణి కార్మికుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇల్లెందులో ఇదే మొదటి కేసు. 24 ఏరియాకు చెందిన ఆ వ్యక్తి గుండె నొప్పితో ఇటీవల సింగరేణి మెయిన్‌ ఆసుపత్రికి వెళ్లారు. స్టంట్‌ వేయాలంటూ అక్కడి వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారు. హైదరాబాద్‌ వెళ్లగా అక్కడి వైద్యులు ఇతడితో కరోనా లక్షణాలు కూడా ఉన్నట్లు అనుమానించారు. నమూనాలు సేకరించి పరీక్షలక పంపగా బుధవారం వచ్చిన రిపోర్టులో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 

భద్రాద్రిలో ఎనిమిది చేరిన కేసులు.. 

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేవలం మూడు రోజుల్లో కరోనా కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. బుధవారం రామవరంలో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రేగళ్లలో ఒక వ్యక్తికి, పాల్వంచలో ఓ డ్రైవర్‌కి పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 8కి చేరింది. కాగా ఇల్లెందులో సింగరేణి ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.