మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jun 24, 2020 , 00:33:20

రైతుల పక్షాన తెలంగాణ సర్కార్‌

 రైతుల పక్షాన తెలంగాణ సర్కార్‌

  • ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు ‘రైతుబంధు’
  • పట్టా పాస్‌బుక్‌ ఉన్న ప్రతిఒక్కరికీ లబ్ధి
  • బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న నగదు
  • నియంత్రిత సాగుపై విపక్షాల రాద్ధాంతం
  • సర్కారుకు రైతులు మద్దతు ఇవ్వడంతో తెల్లమొహం

ఒకవైపు కరోనా సంక్షోభం.. మరోవైపు ఆర్థిక మాంద్యం.. రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు.. నియంత్రిత సాగుకు ఊతమిస్తూ.. విపక్షాల ఆరోపణలు, నిందలను పటాపంచలు చేస్తూ ‘రైతుబంధు’ అమలు చేస్తున్నారు.. పట్టాదారు పాస్‌ పుస్తకం ఉన్న ప్రతిఒక్కరికీ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.. దీంతో రైతులకు ఆర్థిక భరోసా లభించింది.. సోమవారం ఎకరాలోపు ఉన్న వారికి నగదు అందగా మంగళవారం ఎకరా నుంచి మూడెకరాల లోపు వారి ఖాతాల్లో నగదు జమ అయింది.. దీంతో గుండెపై చేయి వేసుకుని రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు..

- ఖమ్మం ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ

విషం చిమ్మిన విపక్షాలు..

 రైతుబంధు పథకంపై విపక్షాలు ఆది నుంచీ విషం చిమ్ముతూనే ఉన్నాయి. పథకం ప్రారంభంలో సీజన్‌కు రూ.4 వేల చొప్పున ఎకరానికి ఏడాదికి రూ.8 వేలను అందించడంతో ప్రతిపక్షాలకు చెంపపెట్టు అయింది. దీంతో నిరుటి నుంచి ప్రభుత్వ పంటల పెట్టుబడిని రూ.10 వేలకు పెంచింది. ఈసారి రైతుబంధు కొనసాగదంటూ విపక్షాలు మళ్లీ అసత్య ప్రచారం చేశాయి. వాటిని సీఎం కేసీఆర్‌ సరైన సమాధానం చెప్పారు. తాజాగా ఈ ఏడాదికి సంబంధించి తొలి సీజన్‌కూ పంటల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో విపక్షాలకు దిమ్మతిరిగింది. 

నియంత్రిత సాగుపై నిందారోపణలు..

మార్కెట్‌లో డిమాండ్‌ కలిగిన పంటలను పండిస్తేనే రైతులకు లాభాలు వస్తాయని నిర్ణయించింది. రైతులను రాజు చేయాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారు. దీనిపైనా ప్రతిపక్షాలు నిందారోపణలు చేశాయి. అయితే సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగానే రైతులందరూ నియంత్రిత సాగుకు ఆమోదం తెలుపడంతో విపక్ష నాయకులు తెల్లమొహం వేశారు. 

విత్తనాలు, ఎరువుల   కొనుగోలు చేస్తున్న రైతులు..

రెండు రోజుల నుంచి తమ ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ అవుతుండడంతో రైతులు వాటిని తీసుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. పట్టణాల్లోని ఎరువుల, విత్తనాలు, పెరుగుమందుల దుకాణాలు రెండు రోజులుగా రద్దీగా ఉంటున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ. 100 కోట్ల నుంచి రూ.120 కోట్ల మేర నిధులు సుమారు  లక్ష మంది రైతుల ఖాతాల్లో జమ అయినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. తొలిరోజున ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు రైతుబంధు సొమ్ము జమ అయింది. మంగళవారం మూడు  ఎకరాల్లోపు ఉన్న రైతులకు జమ చేసినట్లు సమాచారం.

భద్రాద్రి జిల్లాకు రూ. 205.59 కోట్లు

  • 40 వేల మంది రైతుల ఖాతాల్లో జమ అవుతున్న రైతుబంధు సొమ్ము

ఈ వానకాలం సీజన్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు అందించేందుకు పంటల పెట్టుబడి కోసం రూ.205.59 కోట్ల రైతుబంధు నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో 1,34,112 మంది రైతులకు ఈ సాయం అందనుంది. ఇప్పటికే 1,20,300 మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు వ్యవసాయ శాఖకు చేరాయి. మంగళవారం వరకూజిల్లాలో 40వేల మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయింది. 

జమ అయిన  రైతుబంధు సాయం వివరాలు.. 

జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం 2,98,085 మంది రైతులకు గాను రూ.3,56,93,35,445 నిధులను వానకాలం సీజన్‌కు తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. మండలాల వారీగా రైతులకు అందిన పంట సా యం వివరాలు ఇలా ఉన్నాయి. కామేపల్లి మండలం లో 9, 800 మంది రైతులకు రూ.13.96 కోట్లు, ఖమ్మం అర్బన్‌లో 3,590 మందికి రూ.4.23 కోట్లు, రఘునాథపాలెంలో 15,206 మందికి రూ.19.29 కోట్లు, ఖమ్మం రూరల్లో 14, 511 మందికి రూ.16.89 కోట్లు, కూసుమంచిలో 16,882 మందికి రూ.20.24 కోట్లు, నేలకొండపల్లిలో 17,418 మందికి రూ.17.63 కోట్లు, తిరుమలాయపాలెంలో18,138 మందికి రూ.21.34కోట్లు, బోనకల్లులో 15,596 మందికి రూ.16.05 కోట్లు, చింతకానిలో 15,933 మందికి రూ.18.78 కోట్లు, మధిరలో 17,701 మందికి రూ.20.15 కోట్లు, ముదిగొండలో 16,484 మందికి రూ.19.86 కోట్లు, ఎర్రుపాలెంలో 14,522 మందికి రూ.17.76 కోట్లు, కల్లూరులో 19,771 మందికి రూ.21.56 కోట్లు, పెనుబల్లిలో 12,181 మందికి రూ.17.12 కోట్లు, సత్తుపల్లిలో 12,470 మందికి రూ.16.14 కోట్లు, తల్లాడలో 15,714 మందికి రూ.18.30కోట్లు, వేంసూరులో 16,607 మందికి రూ.20.16 కోట్లు, ఏన్కూరులో 8,205 మందికి రూ.12.21 కోట్లు, కొణిజర్లలో 14,233 మందికి రూ.16.59 కోట్లు, సింగరేణిలో 10,736 మందికి రూ.15.27 కోట్లు, వైరాలో 12,387 మంది రైతులకు రూ.13.20 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించింది. 

రైతులకు ఎంతో భరోసా..

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం రైతులకు భరోసాగా నిలుస్తున్నది. రాష్ట్రంలో పెద్ద రైతు అయిన సీఎం కేసీఆర్‌కు రైతుల కష్టాలు తెలుసుకు. అందుకే గతంలో ఏప్రభుత్వమూ అందించని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు.  రైతులు ప్రారంభంలో విత్తనాలు, ఎరువుల కోసం వడ్డీ వ్యాపారుల ఆశ్రయించేవారు. ఇప్పుడు ప్రభుత్వమే పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. 

-లోడిగ వెంకన్నయాదవ్‌, గట్టుసింగారం, కూసుమంచి మండలం

వ్యవసాయానికి ఆసరా..

ఎన్నో ఆశలతో వ్యవసాయ పనులు ప్రారంభించే చిన్న, సన్నకారు రైతులకు రైతుబంధు పథకం ఆసరాగా నిలుస్తున్నది. రైతులకు ఎం త సాయం చేసినా తక్కువే. అయినా పెట్టుబడుల సమయంలో అందించే ఈ నగదు వారికి ఎంతో భరోసాను కల్పిస్తుంది. రాష్ట ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతులకు అండగా ఉంటూ పెట్టుబడిని అందించడం గొప్ప విషయం..

- వాకా మాధవి, కమలాపురం, ముదిగొండ మండలం

సీఎం కేసీఆర్‌కు  రుణపడి ఉంటా

పంటల పెట్టుబడికి సాయం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటా. నాకున్న ఎకరం పది కుంటల భూమికి రూ.6, 250ని నా బ్యాంకు ఖాతాలో జమ చేశారు. వానకాలం పంటల పెట్టుబడికి ఇది ఎంతో అక్కరకు వస్తుంది. వడ్డీలకు తేవాల్సిన పనిలేదు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి సాయం అందించలేదు. 

-వేములపల్లి బుచ్చయ్య, గుంపెళ్లగూడెం, కారేపల్లి

సన్నకారు రైతులకు ఎంతో మేలు

నా లాంటి చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది. రైతుబంధు సాయంగా నా అకౌంట్‌లో రూ.20 వేలను జమ చేసింది. నేను నాలుగు ఎకరాల భూమిని సాగు చేస్తున్నాను. ఈ పెట్టుబడి నాకు ఎంతోగానో ఉపయోగపడింది. విత్తనాలు, ఎరువులు తీసుకున్నాను. పెట్టుబడి ఎలా అనుకుంటున్న సమయంలో సీఎం కేసీఆర్‌ ఆదుకున్నారు.    -కనకం నారాయణ, రైతు, చండ్రుగొండ

పట్టా బుక్‌ ఉన్న ప్రతి రైతుకూ  రైతుబంధు సాయం

ఈ వానకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది. జిల్లాలో ఇప్పటికే 40 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేశాం. వారి మొబైల్‌ ఫోన్‌లకు మెసేజ్‌లు కూడా పంపించాం. జిల్లాలో 1,34,112 మంది రైతులు ఉండగా వారిలో 1,20,303 మంది రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. రైతులు పంటలు వేసే సమయానికి ప్రభుత్వం రైతుబంధును అందించింది. ఇక నియంత్రిత సాగులో రైతులకు చాలా లాభం చేకూరుతుంది.    

 -కొర్సా అభిమన్యుడు. డీఏవో, కొత్తగూడెం

తొలకరి సాగుకు ఎంతో ఉపయోగం

రైతులు తొలకరి పంటలు సాగు చేసుకునేందుకు రైతుబంధు నగదు ఎంతో ఉపయోగకరంగా ఉంది. రైతులు పంటలను సాగు చేసుకునేందుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా ముందుగానే సీఎం కేసీఆర్‌ రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. నాకున్న 4 ఎకరాల పంటభూమిలో పత్తి, మిరప సాగు చేస్తాను. నియంత్రిత సాగు విధానాన్ని కూడా సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టడం హర్షణీయం.

-కుర్రా శ్రీనివాసరావు, మాటూరు, మధిర