ఆదివారం 06 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jun 22, 2020 , 01:05:19

దొడ్డిదారిన ‘పట్టా’బుక్‌

దొడ్డిదారిన ‘పట్టా’బుక్‌

  • పొజీషన్‌లో లేకుండానే జారీ చేసిన రెవెన్యూ అధికారులు
  • పాస్‌బుక్‌ ఆధారంగా భూ ఆక్రమణకు ‘రియల్‌' వ్యాపారి యత్నం
  • ఆసైన్డ్‌ భూమినీ పట్టా భూమిగా చూపేందుకు ప్రయత్నం
  • దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల్లో ఆందోళన

రఘునాథపాలెం: పట్టాదారు పాస్‌బుక్‌ జారీ చేయాలంటే.. రైతుకు ఆ భూమి ఏ విధంగా సంక్రమించింది? రెవెన్యూ రికార్డులు ఏం చెబుతున్నాయి? అనుభవదారుడిగా ఉన్నాడా? లేడా? అనేవి కచ్చితంగా పరిశీలించాలి. వీటిలో ఒక్కటి లేకున్నా పట్టాదారు పాస్‌ పుస్తకం జారీకి అవకాశాలు ఉండవు. కానీ ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి పట్టాదారు పాస్‌ పుస్తకం జారీ చేయడంలో రెవెన్యూ అధికారులు నిబంధనలకు తిలోదకాలిచ్చినట్లు తెలుస్తున్నది. భూమి లేకున్నా, అనుభవదారుడు కాకున్నా రెవెన్యూ అధికారులు పాస్‌బుక్‌ జారీ చేశారు. దానిని ఆధారంగా చేసుకున్న ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి భూ ఆక్రమణకు తెరతీస్తున్నాడు. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా వారసులుగా ఉండి అన్ని రికార్డులతో సాగు చేసుకుంటున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాదు.. దొడ్డిదారిని పట్టా పాసుపుస్తకం పొందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఏ విధంగానైనా భూమిపై హక్కులు పొందాలనే ఉద్దేశంతో అసైన్డ్‌ భూమిని పట్టాగా మార్చే పన్నాగాలు పన్నుతున్నాడు. రఘునాథపాలెం మండలం కోయచలక రెవెన్యూ పరిధిలో జరుగుతున్న ఈ తతంగాన్ని చూసి స్థానికులు కూడా నివ్వెరపోతున్నారు.

కోయచలక రెవెన్యూ సర్వే నెంబర్‌ 190లో బై నెంబర్‌ ‘ఆ’లో ఖమ్మం నగరానికి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పొజీషన్‌లో లేకుండా పట్టాదారు పాస్‌ పుస్తకాన్ని పొందాడు. అధికారులు సైతం ఎలాంటి ఫీల్డ్‌ ఎంక్వైరీ లేకుండానే సదరు రియల్‌ వ్యాపారికి పాస్‌పుస్తకాన్ని మంజూరు చేసినట్లు తెలుస్తున్నది. ఆ పాస్‌ పుస్తకాన్ని ఆయుధంగా మలుచుకున్న వ్యాపారి భూ ఆక్రమణకు తెరలేపుతున్నాడు. కొద్ది నెలలుగా సర్వేల పేరుతో ఆ భూమిలో హక్కుదారులుగా సాగులో ఉన్న రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. సాగులో ఉన్న రైతులకు నోటీసుల మీద నోటీసులు జారీ కావడంతో వారు భయాందోళన చెందుతున్నారు. అసలు రియల్‌ వ్యాపారి సాగులో లేకుండా ఎన్నో ఏళ్ల నుంచి సాగులో ఉంటున్న తమ భూమిలో సర్వేలు చేయడమేంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీంతో కొన్ని నెలలుగా అసలు హక్కుదారులు సర్వేకు సహకరించకపోవడంతో అధికారుల సర్వే వాయిదాలు పడుతూ వస్తున్నది. సర్వే అధికారులు సుమారుగా చూపిన హద్దుల ప్రకారం రియల్‌ వ్యాపారి దౌర్జన్యంగాదౌర్జన్యంగా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో వానకాలం పంట సాగు కోసం పత్తి విత్తనాలు విత్తుకుంటున్న తమను సదరు వ్యాపారి అడ్డుకుంటున్నారని రైతులు వాపోయారు.

అడ్డదారిలో పాస్‌ బుక్కు  పొందాడు

పొజీషన్‌లో లేకుండానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి రెవెన్యూ అధికారులు ‘190/ఆ’ సర్వే నెంబరులో 3 ఎకరాల భూమికి పట్టాదారు పా స్‌ పుస్తకాన్ని జారీ చేశారు. 189 సర్వే నెంబర్‌గా ఉన్న మా భూమిని 190 సర్వే నెంబరుగా చూపుతూ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు. సర్వే చేయాలంటూ ఏడాదికాలంగా అధికారులు నోటీసులు ఇస్తూనే ఉన్నారు. సర్వేకు మేం సహకరించలేదు. దీంతో సదరు వ్యాపారి దౌర్జన్యం గా మా భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు. ఫీల్డ్‌ ఎంక్వైరీ లేకుండా పాస్‌ పుస్తకం జారీపై విచారణ జరిపి న్యాయం చేయాలి.

- విప్పర్ల వెంకన్న, బాధిత రైతు


అసైన్డ్‌ భూమిని పట్టాగా చూపుతున్నారు

మా తాత సూరయ్య పోడు చేసుకోవడంతో 1966లో అప్పటి ప్రభుత్వం అసైన్డ్‌ పట్టాను జారీ చేసింది. ఆనాటి నుంచి వారసత్వంగా భూమిని మేము సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. మూడేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాన్ని సైతం ఇచ్చింది. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వచ్చి మేం సాగు చేసుకుంటున్న అసైన్డ్‌ భూమిని పట్టాగా చూపి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు.

- బీ.సురేశ్‌, బాధిత రైతు

పరిశీలించి విచారణ చేస్తా..

భూమిపై లేకుండా పట్టాదారు పాసుపుస్తకం జారీ చేసిన విష యం నా దృష్టిలో లేదు. ఎప్పుడు, ఎలా జారీ చేశారో పూర్తిగా తెలియదు. ఈ విషయాన్ని పరిశీలించి విచారణ చేపడుతా.

- నర్సింహారావు, తహసీల్దార్‌, రఘునాథపాలెం