శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jun 21, 2020 , 01:36:07

‘సీతారామ’తో ప్రతి ఎకరాకు సాగునీరు

‘సీతారామ’తో ప్రతి ఎకరాకు సాగునీరు

  • ప్రతిపక్ష పార్టీలవి అర్థంలేని ఆరోపణలు
  • గడచిన రెండేళ్లలో ఊహించని అభివృద్ధి
  • ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియానాయక్‌ 

ఇల్లెందు: సీతారామ ప్రాజెక్టు అదనపు ఆయకట్టుతో ఇల్లెందు నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియానాయక్‌ పేర్కొన్నారు. శనివారం ఆమె ‘నమస్తే’తో మాట్లాడుతూ.. ప్రాజెక్టు రీడిజైనింగ్‌ ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరా సాగులోకి వచ్చే విధంగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయన్నారు. త్వరలోనే ఆ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్‌ ఆమోద ముద్ర వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు ఫేజ్‌ 1లో ఇల్లెందు నియోజకవర్గం తక్కువ భూమి సాగులోకి వస్తుందని, దానిని రెండింతలు చేసే విధంగా రూపకల్పన చేశామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆకాంక్షకు అనుగుణంగానే ఫేజ్‌ 1లో అదనపు సాగు కోసం (రిజర్వాయర్‌తో సంబంధం లేకుండా) ప్రాజెక్టు అధికారులు సర్వే జరిగిందన్నారు. ఇల్లెందు నియోజకవర్గంలోని ఐదు మండలాలు కలిపి 1.20 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చే విధంగా రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. మరో 30 వేల ఎకరాలు సాగు యోగ్యత కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయన్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన సర్వే నివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేస్తామని తెలిపారు. ఇక గ్రీన్‌ సిగ్నల్‌ రావడమే తరువాయి అన్నారు. తద్వారా బీడు, బంజర, మెట్ట, ఫారెస్టు భూములన్నింటికి ప్రాణం పోసినట్లవుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు ఫేజ్‌ 1లో ఉమ్మడి జిల్లాలో 6.74 లక్షల ఎకరాల సాగుకు యోగ్యత లభించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో 60 వేల ఎకరాలు సాగుకు వచ్చే విధంగా రూపకల్పన చేశారన్నారు. అదనపు ఆయకట్టు కోసం సీఎం కేసీఆర్‌ను ప్రత్యేకంగా కోరామని, ఇల్లెందు నియోజకవర్గంలో అందుకు రెండింతలు ఆయకట్టు పెంచే విధంగా ప్రత్యేక రీడిజైనింగ్‌ చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. కారేపల్లి మండలం చీమలపాడు వద్ద 150 మీటర్ల ఎత్తులో పంప్‌హౌజ్‌ ద్వారా లిఫ్టు చేయనున్నారని, అక్కడి నుంచి నేరుగా పైప్‌లైన్‌ ద్వారా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లెందు మండలం లలితాపురం చెరువులో 2016 మీటర్ల ఎత్తులో లిఫ్టు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అదే విధంగా మరో పైప్‌లైన్‌ లలితాపురం నుంచి 9.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోంపేడు ప్రాంతంలో 245 మీటర్ల ఎత్తులో లిఫ్టు చేయనున్నామని తెలిపారు. ఈ రెండు చోట్ల నుంచి ఎటువైపైనా గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించవచ్చన్నారు.