సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 18, 2020 , 02:54:59

ప్రజలు బాధ్యతగా మెలగాలి..

ప్రజలు బాధ్యతగా మెలగాలి..

  • కరోనా కట్టడికి సహకరించాలి
  • రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌
  • నియంత్రిత వ్యవసాయానికి రైతాంగం ముందుకు రావాలి
  • సీఎం కేసీఆర్‌ ఆశించిన స్థాయిలో జిల్లాలో సాగు జరగాలి
  • జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌
  • నకిలీ వ్యాపారులపై పీడీ యాక్ట్‌ : కలెక్టర్‌ కర్ణన్‌
  • వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళి 

మామిళ్లగూడెం : కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ సూచించారు. గురువారం జిల్లా ప్రజాపరిషత్‌ సమావేశ మందిరంలో చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ అధ్యక్షతన జరిగిన జెడ్పీ సాధారణ సమావేశంలో మంత్రి మాట్లాడారు.

మనం చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లతో కరోనా వ్యాప్తి పెరుగుతుందని, ఎవరికి వారుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బయట తిరిగే సమయంలో కానీ, జనసమూహాల్లో ఉన్నప్పుడు కానీ తప్పనిసరిగా మాస్క్‌లను ధరించాలని, హ్యాండ్‌ శానిటైజర్లను తప్పకుండా వాడాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఉందని, వైద్య ఆరోగ్యశాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం చేస్తున్న సూచనలను ప్రజలు తప్పకుండా పాటించాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల ఆరోగ్యాలపై ముందుచూపుతో వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలతో పాటు బడ్జెట్‌ను కేటాయించారన్నారు. రైతులు ఒక పద్ధతిలో సాగు చేసేలా నియంత్రిత విధానాలను అమలు చేస్తున్నారని, దీనికి రైతాంగం సహకరించాలని పిలుపునిచ్చారు. గత ఏడాది పండిన పంటల్లో ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించి స్వయంగా కొనుగోలు చేసిందన్నారు. అన్నదాతలను ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు తోడ్పాటును అందించాలని సూచించారు.

నకిలీ వ్యాపారులపై పీడీ యాక్ట్‌ : కలెక్టర్‌, ఆర్‌వీ కర్ణన్‌

జిల్లాలో నకిలీ విత్తనాలు, పురుగు మందుల వ్యాపారం నిర్వహిస్తే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ హెచ్చరించారు. ఇప్పటికే పోలీస్‌ యంత్రాంగంతో పాటు వ్యవసాయశాఖ అధికారులను అప్రమత్తం చేసి తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 129 క్లస్టర్లలో రైతుబంధు వేదికలను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.28 కోట్లు, ఐదు వేల కల్లాల నిర్మాణానికి రూ.31 కోట్లు విడుదల చేసిందన్నారు. వ్యవసాయ శాఖ మరింత అప్రమత్తతతో పాటు ముఖ్యమంత్రి సూచించిన నియంత్రిత సాగుకు సిద్ధం చేసిన ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించారు.

కొవిడ్‌-19 నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ విధానాలు, రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పాలేరు శాసనసభ్యుడు కందాల ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలతో రైతులు, ప్రజలు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. జేడీఏ ఝాన్సీలక్ష్మీదేవి మాట్లాడుతూ రైతులకు పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు.

డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ మాలతి మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా వ్యాప్తిని నివారించడంలో యంత్రాంగానికి సహకరించాలని, సీజనల్‌ వ్యాధుల పట్ల ఆరోగ్యశాఖ అప్రమత్తంగా సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో సీహెచ్‌ ప్రియాంక, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ మరికంటి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ప్రధానాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆత్మ పీడీ విజయనిర్మల, గ్రంథాలయ చైర్మన్‌ ఖమర్‌, వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.    

సీఎం కేసీఆర్‌ ఆశించిన స్థాయిలో సాగు జరగాలి :  జెడ్పీ చైర్మన్‌, లింగాల కమల్‌రాజ్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశించిన స్థాయిలో పంటల సాగు జరిగేవిధంగా జిల్లా రైతాంగం ముందుకు రావాలన్నారు. ఇప్పటికే ఎంతో మంది రైతులు అభ్యుదయ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారని, ఇదే పద్ధతిలో నియంత్రిత సాగు విధానాలను కూడా అమలు చేయాలన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు ఎల్లప్పుడూ సహకరించాలని కోరారు. 

అమర జవాన్‌ సంతోష్‌ బాబుకు ఘన నివాళి 

భారత్‌ చైనా మధ్య జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన తెలంగాణ రాష్ట్ర వాసి, కల్నల్‌ సంతోష్‌బాబుకు జిల్లా పరిషత్‌ పాలకమండలి, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఘనంగా నివాళి అర్పించారు. ముందుగా సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.