శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 16, 2020 , 03:06:26

ప్రతి ఎకరాకు సాగునీరు..

ప్రతి ఎకరాకు సాగునీరు..

  • బేతుపల్లి పెద్దచెరువు కాలువలో పూడికతీత
  • 15 గ్రామాల పరిధిలోని 10 వేల ఎకరాలకు నీరు
  • పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి రూరల్‌: మండలంలో వ్యవసాయానికి అయుపట్టుకు ప్రధాన సాగునీటి వనరు అయిన బేతుపల్లి పెద్దచెరువు ఆయకట్టు పూడికతీత పనులు జోరుగా సాగుతున్నాయి.  సోమవారం ఎమ్మెల్యే సండ్ర వీరయ్య కాలువ పనులను కలియతిరిగి ప్రతి కాలువ పూడికతీత పనులను పరిశీలించారు. చెరువు ఆయకట్టు పరిధిలోని 15 గ్రామాలకు చెందిన సుమారు 10వేల ఎకరాలకు సాగునీరు అందించే కాలువలు ఐదేళ్లుగా పూడికతీతకు నోచుకోక పిచ్చిమొక్కలతో నిండిపోయాయి.  దీంతో ప్రతి ఏటా నీరు విడుదల చేస్తున్నప్పటికీ కాలువలు పారక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఈ సమస్యను రైతులు ఇటీవల ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆయన ఎంపీడీవో, ఐబీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కాలువలను పూర్తిస్థాయిలో పూడికతీయించి రైతులకు నీరందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా 15 గ్రామాల నుంచి 23 కిలోమీటర్ల మేర పారే సాగునీటి కాలువలను శుభ్రపరిచే  క్రమంలో 2500 మంది ఉపాధి కూలీలు, 12 పొక్లెయిన్ల ద్వారా పూడికతీత పనులు చేపట్టారు. దీంతో ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వానకాలం పంటకు బేతుపల్లి చెరువునీళ్లు నేరుగా తమ పొలాల్లోకి పారుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కూలీలను వ్యవసాయ రంగానికి అనుసంధానించి రైతులకు ఉపయోగపడేలా పనులు చేయించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడంతో జిల్లాలో తొలిసారిగా ఎమ్మెల్యే సండ్ర ఈ పనులను ప్రారంభించారు. మరో వారం రోజుల వరకు ఈ పూడికతీత పనులు కొనసాగనున్నాయి.