సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 16, 2020 , 02:48:13

ప్రతీ గ్రామ పంచాయతీకి ఓ వైకుంఠధామం

ప్రతీ గ్రామ పంచాయతీకి ఓ వైకుంఠధామం

  • ‘ఉపాధి’ పనుల్లో శ్మశానవాటికల నిర్మాణాలు
  • భద్రాద్రి జిల్లాలో చురుగ్గా సాగుతున్న పనులు

 గ్రామానికి గుడి, బడి, ఆసుపత్రి ఎంత ముఖ్యమో మానవుడి జీవితంలో ఆఖరి మజిలీ ప్రశాంతంగా జరుపుకునేందుకు వైకుంఠధామం(శ్మశానవాటిక) కూడా అంతే ముఖ్యం. అందుకే చివరకు మనం చేరాల్సిన శ్మశానవాటికకు కూడా ప్రాధాన్యమివ్వాలని, ఇవన్నీ ప్రాథమిక బాధ్యతలని సీఎం కేసీఆర్‌ భావించారు. ప్రతి గ్రామపంచాయతీలోనూ వైకుంఠధామం ఏర్పాటుకు చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ వైకుంఠధామాలను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్నారు. ఒక్కో వైకుంఠధామం నిర్మాణానికి ఈజీఎస్‌ నిధులైతే రూ.11.50 లక్షల వరకు, పంచాయతీరాజ్‌ నిధులైతే రూ.12.50 లక్షల వరకు వెచ్చించుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది.                              - కొత్తగూడెం అర్బన్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 479 పంచాయతీల్లో అవసరమైన చోట వైకుంఠధామాలు నిర్మించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించారు. ఎక్కడ వైకుంఠధామం అవసరమో గుర్తించాలని, భూమిని సేకరించి వివరాలను అందజేయాలని మండలాల అధికారులకు సూచించారు. వెంటనే పనులను కూడా చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు 401 పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణాలు ప్రారంభమై పురోగతిలో ఉన్నాయి. 45 పంచాయతీల్లో శ్మశానవాటిక నిర్మాణం కోసం నిర్ణయించిన భూములు వివాదాల్లో ఉన్నాయి. ఆ పంచాయతీల్లో ఇంకా పనుల్లో స్తబ్ధత నెలకొంది. మిగిలిన 33 పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడంతో పనులు మొదలుకాలేదు.  

కొన్ని చోట్ల ఆక్రమణలు..

కొన్ని పంచాయతీల్లో చాలా ఏళ్లుగా శ్మశానవాటికల స్థలాలు ఆక్రమణలు, కబ్జాల్లో ఉన్నాయి. ఈ స్థలాలను రక్షించేందుకు, అంతిమసంస్కారాలు సజావుగా సాగేందుకు ఆయా పంచాయతీలే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కానీ వీటిపై పంచాయతీల ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు నిర్లక్ష్యం వహిస్తుండడంతో వాటిల్లో కదలిక ఉండడం లేదు. 

శ్మశానవాటికలో సదుపాయాలు

శ్మశాన వాటిల్లో అంత్యక్రియలు నిర్వహించుకోవాలంటే గతంలో ఒక ప్రహసనంలా ఉండేది. వీటిన్నింటికీ చరమగీతం పాడాలని, శ్మశానవాటికల్లో అన్ని సదుపాయాలూ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. భౌతికకాయాలను దహనం చేసుకునేందుకు రెండు ప్లాట్‌ఫాంలు, దుస్తులు మార్చుకునేందుకు మహిళలకు, పురుషులకు వేర్వేరు గదులు, బాత్‌రూంలు, నీటి సరఫరా, సోలార్‌ లైట్లు, శ్మశానవాటిక చుట్టూ చెట్లు, పెన్సింగ్‌, శ్మశానవాటికను తెలిపే పెద్ద ఆర్చ్‌ వంటి ఏర్పాట్లు, సౌకర్యాలతో వైకుంఠధామాలు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుత వైకుంఠధామాలన్నీ ఇలాంటి సకల సౌకర్యాలతో పూర్తవుతున్నాయి. 

వేగంగా పూర్తి చేస్తున్నాం. 

ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠధామం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ వీటికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉపాధి హామీ పనుల ద్వారా వీటిని నిర్మించాలని ఆదేశించారు. పంచాయతీల్లో ఖాళీ స్థలం ఉంటే గ్రామ కమిటీ తీర్మానం, ప్రజాప్రతినిధుల సహకారం మేరకు వీటి నిర్మాణాలు చేపడుతున్నాం. పంచాయతీ ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు వీటి నిర్మాణాలపై దృష్టి సారించాలి. ప్రజలు కూడా ముందుకొచ్చి సహకారం అందిస్తే వీటిని మరింత తొందరగా పూర్తిచేసుకోవచ్చు. కొన్ని పంచాయతీల్లో నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల పూర్తి దశకు చేరుకున్నాయి. వాటిని కూడా మరింత వేగంగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

-జీ.మధుసూదనరాజు, ఇన్‌చార్జి డీఆర్‌డీవో