గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 15, 2020 , 00:06:05

ఇంటర్నల్స్‌ ఆధారంగా ‘టెన్త్‌' మార్కుల గ్రేడింగ్‌

ఇంటర్నల్స్‌ ఆధారంగా ‘టెన్త్‌' మార్కుల గ్రేడింగ్‌

  • వచ్చిన మార్కులకు ఐదు రెట్లతో కొలమానం
  • ప్రతి సబ్జెక్టుకూ ఇదే విధానం వర్తింపు
  • అన్ని సబ్జెక్టుల  యావరేజ్‌తో జీపీఏ నిర్ధారణ

తెలంగాణ ప్రభుత్వం టెన్త్‌ విద్యార్థులను పరీక్షలు రాయకుండానే  ప్రమోట్‌ చేసిన సంగతి విదితమే.. అయితే.. ఎలా గ్రేడింగ్‌లు ఇస్తారనే విషయంపై చాలామందికి స్పష్టత లేదు..   ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తూ విద్యాశాఖ కొన్ని మార్గదర్శకాలను  విడుదల చేసింది.. ఇంటర్నల్స్‌ ఆధారం మార్కుల గ్రేడింగ్‌ చేస్తామని    ప్రకటించింది.. నియమ, నిబంధనలను  అనుసరించి త్వరలో ఫలితాలు  విడుదల చేయనుంది. 

 అవును.. ఇంటర్నల్స్‌ ఆధారంగానే టెన్త్‌ మార్కుల గ్రేడింగ్‌ జరుగనుంది. ఇప్పుడు ప్రతి సబ్జెక్టులోనూ ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)కు 5 మార్కుల చొప్పున కేటాయిస్తున్నారు. ఇలా ఒక విద్యాసంవత్సరంలో ప్రతి సబ్జెక్టుకూ నాలుగు ఎఫ్‌ఏలు ఉంటాయి. అంటే 20 మార్కులు. ఇవి ఇంటర్నల్స్‌ అన్నమాట. ఇప్పుడు గ్రేడింగ్‌ కోసం వీటిని వంద మార్కులుగా పరిగణిస్తారు. దీని ప్రకారం జీపీఏ కేటాయించనున్నారు. ఒకవేళ ఒక విద్యార్థికి ఒక సబ్జెక్టులో నాలుగు ఎఫ్‌ఏలకూ కలిపి 17 మార్కులే వచ్చాయనుకుంటే దీనిని ఐదు రెట్లు లెక్కిస్తారు. అంటే 85 మార్కులు. గ్రేడింగ్‌ విధానంలో 81 నుంచి 90 మధ్య మార్కులు వచ్చిన విద్యార్థిని ఏ2 గ్రేడ్‌గా పరిగణించి 9 జీపీఏగా లెక్కిస్తారు. 100 మార్కులు వచ్చిన విద్యార్థిని ఏ1గా గ్రేడ్‌గా పరిగణించి 10 జీపీఏగా లెక్కిస్తారు. 

కొత్తగూడెం ఎడ్యుకేషన్‌: కరోనా లాక్‌డౌన్‌తో కారణంగా మొదట పదో తరగతి పరీక్షల్లో 8 పేపర్లు వాయిదా పడ్డాయి. ఈ నెల 8 నుంచి వాటిని మళ్లీ నిర్వహించాలనుకున్నా.. వైరస్‌ ఉధృతి కారణంగా ప్రభుత్వం వెనుకడుగు వేసింది. సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయిలో సమీక్షించి పరీక్షలకు మొత్తానికి మొత్తమే రద్దు చేశారు. ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గేడింగ్‌లు కేటాయించనున్నట్లు స్పష్టంచేశారు. దీంతో ఇంటర్నల్‌ మార్కులు, లెక్కల పనిలో విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే గ్రేడింగ్‌ విధానం ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఇటు తల్లిదండ్రుల్లోనూ, అటు విద్యార్థుల్లో నెలకొంది. దీన్ని నివృత్తి చేసేందుకు పరీక్షల విభాగం అధికారులు ప్రాథమికంగా గ్రేడింగ్‌ విధానాన్ని విడుదల చేశారు. 

ఇంటర్నల్‌ విధానం ఇలా..

2014కు ముందు పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమలులో ఉండేది. దీని ప్రకారం 9, 10 తరగతుల్లో త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక పరీక్షల విధానాన్ని తొలగించారు. 2015 నుంచి నిర్మాణాత్మక మూల్యాంకనం (ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌- ఎఫ్‌ఏ), సంగ్రహణాత్మక మూల్యాంకనం (సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ - ఎస్‌ఏ) విధానాలను అమల్లోకి తెచ్చారు. వీటి ప్రకారం ఒక్కో విద్యార్థికి ఆ విద్యా సంవత్సరంలో నాలుగు ఎఫ్‌ఏలు, రెండు ఎస్‌ఏలు నిర్వహిస్తారు. ఇందులో నాలుగు ఎఫ్‌ఏలను ఒక్కోటి 20 మార్కులు ఉంటాయి. మిగతా 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఇప్పుడు వార్షిక పరీక్షలు రద్దు కావడంతో ప్రతి సబ్జెక్టు ఇంటర్నల్స్‌లో విద్యార్థికి వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వాల్సి వస్తున్నది. ఇందుకోసం ఇంటర్నల్స్‌ను ఐదు రెట్లుగా పరిగణించి ఆ వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులు పరీక్షల విభాగానికి పంపారు. ప్రస్తుతం 2019 జూలై, ఆగస్టు, నవంబర్‌, 2020 జనవరి నెలల్లో ఎఫ్‌ఏలను నిర్వహించారు. 

గ్రేడ్‌లు, జీపీఏలు ఎలా కేటాయిస్తారంటే..

ప్రతి సబ్జెక్టుల్లో ఒక్కో విద్యార్థికి ఉన్న ఇంటర్నల్‌ మార్కులను 100 మార్కులుగా పరిగణిస్తారు. ఈ 20 మార్కుల్లో విద్యార్థులకు ఎంత శాతం మార్కులు వచ్చాయో పరిశీలిస్తారు. వాటి పర్సంటేజీ ప్రకారం జీపీఏలను కేటాయిస్తారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి సైన్స్‌ లో ఇంటర్నల్‌ మార్కులు 20కి 20 వచ్చి ఉంటే అతడికి వందకి వంద మార్కులు వచ్చినట్లు లెక్కిస్తారు. అప్పుడు ఆ విద్యార్థికి ఆ సబ్జెక్టుల్లో ఏ1 గ్రేడ్‌ ఇచ్చి 10 జీపీఏని కేటాయిస్తారు. అలాగే అన్ని సబ్జెక్టుల్లోనూ ఏ1 గ్రేడ్‌ వస్తే 10/10 జీపీఏ వస్తుంది. ఒకవేళ ఆ విద్యార్థికి ఇంటర్నల్స్‌లో ఒక్కో సబ్జెక్టులో 18 మార్కులే వస్తే అతడికి 90 మార్కులు వచ్చినట్లు పరిగణిస్తారు. ఏ2 గ్రేడ్‌తో 9 జీపీఏ వస్తుంది. అయితే ఈ విధానాలన్నింటిపైనా త్వరలో అధికారికంగా మరింత స్పష్టత రానుంది. 

ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగానే గ్రేడ్లు

లాక్‌డౌన్‌తో టెన్త్‌ పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కానీ విద్యార్థులకు గ్రేడ్‌ పాయింట్లు కేటాయించాల్సి ఉంది. సమచారం పంపాలని అన్ని మండలాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వ సూచనల ప్రకారం ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్‌ పాయింట్లు కేటాయిస్తాం.”
 -డీఈవో, సరోజినీదేవి