ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 14, 2020 , 02:39:23

పాండవుల గుట్టపై మొలకెత్తిన ఎర్రచందనం మొక్కలు

పాండవుల గుట్టపై మొలకెత్తిన ఎర్రచందనం మొక్కలు

ఖమ్మం రూరల్‌: మండలంలోని పాండవుల గుట్టపై ఎర్రచందనం మొక్కలు మొలిచాయి. ఇందుకోసం పద్మశ్రీ వనజీవి రామయ్య చేసిన ప్రయత్నం ఫలించింది. ఖమ్మం రూరల్‌ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య మొక్కల పెంపకమే జీవనంగా మార్చుకున్నాడు. ఏడు పదుల వయసు దాటినా, శరీరంలో శక్తి లేకపోయినా మొక్కల కోసమే ఆయన ఆరాటపడుతుంటాడు. ఒంట్లో ఉన్న సత్తువనంతా కూడదీసుకొని కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తూనే ఉంటాడు. ఎన్నో రకాల విత్తనాలను సేకరించి ఖాళీస్థలాల్లో చల్లుతుంటాడు. మొక్కలను రోడ్ల వెంట నాటి పెంచుతుంటాడు. ఇలా కోటి మొక్కల మార్క్‌ను కూడా ఎప్పుడో దాటాడు రామయ్య. మొక్కలను నాటి వృక్షాలుగా పెంచితే అవి మనల్ని రక్షిస్తాయంటూ నమ్మి ముందుకు సాగుతున్న రామయ్య కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆయనను సత్కరించిన విషయం విదితమే. విలువైన ఎర్రచందనం మొక్కలనూ నాటాలని సంకల్పించిన వనజీవి.. నిరుడు మండలంలోని పాండవుల గుట్టపై విరివిగా ఆ విత్తనాలను చల్లాడు. ఇటీవల కొంతకాలంగా వర్షాలు కురుస్తుండడంతో అవి మొలకొత్తుతున్నాయి. చల్లిన విత్తనాల్లో అధిక శాతం మొలకెత్తి మొక్కలుగా పెరుగుతుండడంతో ఎంతో ఆనందంగా ఉందంటున్నాడు ఈ పద్మశ్రీ.