ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 12, 2020 , 00:31:49

కొత్తగూడెంలో మెగా పార్క్‌ ఏర్పాటుకు చర్యలు

కొత్తగూడెంలో మెగా పార్క్‌ ఏర్పాటుకు చర్యలు

  • ఆగస్టు 15 లోపు సులభ్‌ కాంప్లెక్సులు పూర్తి చేయాలి
  • భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి  
  • బల్దియాల అభివృద్ధిపై సమీక్ష

కొత్తగూడెం అర్బన్‌: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధిపై కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, కమిషనర్లు, పట్టణ ప్రగతి ప్రత్యేకాధికారులతో గురువారం కొత్తగూడెం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో సుదీర్ఘంగా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ... ప్రతి మున్సిపాలిటీలో నూరుశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలన్నారు. పన్నుల వసూళ్లలో వెనుకంజలో ఉన్న ఇల్లెందు, కొత్తగూడెం సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని కమిషనర్లను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయని కమిషనర్లపై క్రమశిక్షణాచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి మున్సిపాలిటీలో సులభ్‌ కాంప్లెక్స్‌లు, పౌర సేవాకేంద్రాల ఏర్పాటుపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. వీధి వ్యాపారులకు ప్రత్యేకంగా జోన్‌ ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే ఆగష్టు 15 వరకు ప్రతి మున్సిపాలిటీలో సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు పూర్తిచేసి ప్రజల అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు ఇంజినీరింగ్‌, మున్సిపల్‌ కమిషనర్లతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆటోనగర్‌ ఏర్పాటుకు స్థలం సేకరించాలని, మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను పార్కులుగా అభివృద్ధి చేయాలని, మున్సిపల్‌ స్థలాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మున్సిపల్‌ ఆస్తుల దురాక్రమణ జరిగితే చైర్మన్లను, కమిషనర్లను బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీకి కేటాయించిన డంపింగ్‌ యార్డులోని పదెకరాల్లో మెగా పార్క్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. పార్కుల్లో చెట్లు పెంచేందుకు దాతల సహకారం చాలా అవసరమని అన్నారు. ఈ దాతల కుటుంబ సభ్యుల గుర్తుగా పార్కుల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. డంపింగ్‌ యార్డుల నిర్వహణ ప్రైవేటీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వైకుంఠ ధామాలకు గ్రీన్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఎవరైనా అలసత్వంగా వ్యవహరిస్తే బదిలీ, సస్పెన్షన్‌, సరెండర్‌ వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాలుగు మున్సిపాలిటీలతోపాటు మే జర్‌ పంచాయతీల్లో 15 రోజుల్లో బయోమెట్రిక్‌ హాజరు అమలు చేయాలన్నారు.  సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, అటవీశాఖాధికారి లక్ష్మణ్‌ రంజిత్‌ నాయక్‌, చైర్మన్లు సీతాలక్ష్మి, వెంకటేశ్వర్లు, ఆర్డీవో స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.