శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 12, 2020 , 00:26:04

94.92 శాతం వసూలైన ఇంటి పన్నులు

94.92 శాతం వసూలైన ఇంటి పన్నులు

  • రూ.11.46 కోట్ల  టార్గెట్‌కు రూ.10.87 కోట్లు వసూలు 
  • ఎనిమిది మండలాల్లో వంద శాతం పూర్తి
  • పల్లె ప్రగతే స్ఫూర్తి అంటున్న పీఆర్‌ అధికారులు

పల్లె ప్రగతి స్ఫూర్తినిచ్చింది. ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చింది. ప్రత్యేకంగా ఇంటి పన్నుల వసూలులో మునుపెన్నడూ లేనన్ని ఫలితాలను సాధించింది. అవును.. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్లు లక్ష్యానికి చేరువయ్యాయి. 94.92 శాతం పూర్తయ్యాయి. రూ.11.46 కోట్లను ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకోగా.. రూ.10.87 కోట్లు వసూలయ్యాయి. సాధారణంగా పంచాయతీరాజ్‌ శాఖ నూటికి 85 శాతాన్నే సంపూర్ణ లక్ష్యంగా పరిగణనలోకి తీసుకుంటుంది. కానీ ఈసారి దాన్నికూడా అధిగమించింది. ఎనిమిది మండలాల్లో ఏకంగా వంద శాతం పన్నులు వసూలయ్యాయి.  -    కొత్త‌గూడెం

 జిల్లాలో గతంలో 205 పంచాయతీలు ఉండేవి. వీటి సంఖ్య ఇప్పుడు 479కి పెరిగింది. కొత్త పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూలులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందు వరుసలో నిలిచింది. పన్నుల ఆదాయంతో తాగునీరు, పారిశుధ్యం, డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు వంటి కనీస సౌకర్యాలన్నీ సమకూరుతున్నాయి. ప్రభుత్వం కొత్తగా అన్ని గ్రామాలకూ నియమించిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు కూడా శక్తివంచన లేకండా పనిచేయడం లక్ష్యానికి దగ్గరగా పన్నులు వసూళ్లు కావడానికి దోహదమైంది. 

లక్ష్యం రూ.11 కోట్ల్లు..   

పంచాయతీరాజ్‌ శాఖ సాధారణంగా నూటికి 85 శాతాన్నే పన్నుల వసూలుకు టార్గెట్‌గా పరిగణిస్తుంది. కానీ జిల్లాలో ఈ ఏడాది అంతకుమించిన టార్గెట్‌ను నమోదు చేసింది. రూ.11 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటికే రూ.10.87 కోట్లకు పైగా (94.92 శాతం) వసూలు చేసింది. ఇందులో పినపాక, దమ్మపేట, ఆళ్లపల్లి, ములకలపల్లి, సుజాతనగర్‌, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల మండలాల్లో ఇంటి పన్నులు వంద శాతం వసూలయ్యాయి. పినపాక మండలంలో రూ.32,35,460, దమ్మపేట మండలంలో రూ.40,62,287, ఆళ్లపల్లిలో రూ.4,31,142, ములకలపల్లిలో రూ.19,75,799, సుజాతనగర్‌లో రూ.53, 60,277, టేకులపల్లిలో రూ.25,98,655, ఇల్లెందులో రూ.25,35,166 లక్ష్యంకాగా మొత్తానికి మొత్తం వసూలయ్యాయి.

పల్లె ప్రగతే  స్ఫూర్తి

పల్లె ప్రగతి కార్యక్రమం పంచాయతీలకు స్ఫూర్తినిచ్చింది. పంచాయతీలకు కొత్త కార్యదర్శులను నియమించడంతోపాటు వసూళ్లు బాగా జరిగాయి. ఖాళీగా ఉన్న పంచాయతీల్లో కూడా కార్యదర్శులను నియమిస్తున్నాం. మొత్తం 11,46,53,504కు గాను రూ.10.87.55.147 పన్నులు వసూలయ్యాయి. ఇప్పటికే 94.92 శాతం పన్నుల వసూళ్లు పూర్తయ్యాయి. వంద శాతం లక్ష్యాన్ని సాధిస్తాం.  - డీపీవో ఆశాలత