శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 10, 2020 , 01:45:04

బీడీ ఆకుల సేకరణతో ఆదివాసీలకు నెలరోజులపాటు జీవనోపాధి

బీడీ ఆకుల సేకరణతో ఆదివాసీలకు నెలరోజులపాటు జీవనోపాధి

  • ఆరు ఫారెస్ట్‌ డివిజన్లలో 29,676 స్టాండర్డ్‌ బ్యాగుల సేకరణ రోజుకు రూ.200 - రూ.600 ఆదాయం

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: ఆదివాసీల కల్పతరువు తునికాకు (బీడీ ఆకు). దాని సేకరణ వారికి చక్కని జీవనోపాధి. 50 ఆకుల కట్టకు కాంట్రాక్టర్లు రూ.1.45 చొప్పున చెల్లిస్తుండడంతో ఒక్కో కార్మికుడికి రోజుకు సగటున రూ.200 నుంచి రూ.600 వరకూ ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది 35,700 స్టాండర్డ్‌ బ్యాగుల సేకరణ లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు దాదాపు 29,676 స్టాండర్డ్‌ బ్యాగుల తునికాకును అటవీ అధికారులు కాంట్రాక్టర్ల ద్వారా సేకరించారు. మరో పదిరోజులపాటు సేకరణ కొనసాగే అవకాశం ఉంది.  నెలరోజులపాటు ఉపాధి లాక్‌డౌన్‌ కారణంగా ఈసారి ఏజెన్సీలో తునికాకు సేకరణ ఆలస్యంగా ప్రారంభమైంది. సుమారు నెల రోజుల క్రితం మొదలైన తునికాకు సేకరణ ప్రస్తుతం ముగింపు దశకు వచ్చింది. అటవీ శాఖ అధికారులు మొదటగా ప్రూనింగ్‌ (మండ కొట్టే) పనులు చేయించారు. 40 రోజుల తర్వాత మండకొట్టిన ప్రదేశంలో లేత ఆకులు చిగురించి కోతకు వస్తాయి. ఆ ఆకును కార్మికులు సేకరిస్తారు.

మండ కొట్టే ప్రక్రియతో ప్రారంభమయ్యే తునికాకు సేకరణ సుమారు నెల రోజులపాటు సాగుతుంది. ఆకును సేకరించడం, 50 ఆకుల చొప్పున వేరు చేసి కట్టలు కట్టడం, వాటిని కాంట్రాక్టర్లకు విక్రయించడం, వారు ఆ కట్టలను కల్లంలో ఎండబెట్టడం, తర్వాత బస్తాల్లో నింపి లారీల ద్వారా గోడౌన్‌లకు తరలించడం వంటి ప్రక్రియలు ఉంటాయి. ఈ తునికాకు సేకరణ వల్ల ఆదివాసీలకు చేతినిండా పని, శ్రమకు తగ్గ కూలి లభిస్తాయి. ఎండలు ఉండడంతో కార్మికులు తెల్లవారుజామునే ఆకు సేకరణ కోసం అడవులకు వెళ్తారు. ఉదయం 9 గంటలలోపు ఆకులు సేకరించుకొని ఇళ్లకు చేరుకుంటారు. అనంతరం ఆ ఆకును పేర్చుతారు. 50 ఆకులను ఒక కట్టగా కడతారు. సాయంత్రం అయ్యాక కల్లాలకు తీసుకెళ్లి కాంట్రాక్టర్లకు విక్రయిస్తారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, కిన్నెరసాని ఫారెస్ట్‌ డివిజన్లలో తునికాకుల  సేకరణ పూర్తికావొచ్చింది.

29,676 స్టాండర్డ్‌ బ్యాగుల సేకరణ:

జిల్లావ్యాప్తంగా 11 ఫారెస్ట్‌ రేంజ్‌ల పరిధిలో 35,700 స్టాండర్డ్‌ బ్యాగుల సేకరణను అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 29,676 స్టాండర్డ్‌ బ్యాగుల తునికాకు మాత్రమే లభ్యమైంది. 50 ఆకుల కట్టకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ల ద్వారా రూ.1.45 చెల్లిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు, వృద్ధులు తునికాకును సేకరిస్తారు. ప్రతి కార్మికుడూ రోజుకు 100 కట్టల నుంచి 500 కట్టల వరకు విక్రయిస్తాడు. సగటును రోజుకు రూ.200 నుంచి రూ.600 నుంచి వరకు ఆదాయం వస్తుంది.