సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 10, 2020 , 01:41:01

ఉమ్మడి జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షం

ఉమ్మడి జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షం

  • వేంసూరులో పిడుగుపాటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారులు 
  • వాహనాలపై విరిగిపడిన చెట్లు.. పలు ప్రాంతాలు జలమయం
  • వైరాలో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్‌ 

ఖమ్మం, నమస్తే తెలంగాణ/కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు విస్తృతంగా వీయడంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఖమ్మం జిల్లాలోని వైరా, కొణిజర్ల, వేంసూరు, పెనుబల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచింది. కూసుమంచి మండలంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో పిడుగుపాటుతో సమీపంలో ఆడుకుంటున్న చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే స్థానికులు వారిని సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొణిజర్ల మండలం పల్లిపాడులో సమీపంలో ఈదురుగాలులకు రోడ్డుపై వెళ్తున్న కారుపై చెట్టు విరిగిపడడంతో క్షణకాలంలో ప్రమాదం తప్పింది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలుకాలేదు. వాహనం ధ్వంసమైంది. వైరాలో భారీ వర్షం కురవడంతో రోడ్లకి ఇరువైపుల వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్‌ వరకు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పెనుబల్లి మండలంలో ఈదురుగాలులతో కూడిన గాలివర్షం కురిసింది. కొత్తగూడెం జిల్లా కేంద్రంతో పాటు చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌ మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. ఈదురు గాలులకు కొద్దిసేపు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఒక్కసారిగా జిల్లాలో వాతావరణం చల్లబడింది. మృగశిర కార్తె ఆరంభంలోనే వర్షం పడడంతో సేద్యానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. రైతన్నలు విత్తనాలు వేసేందుకు మంగళవారం కురిసిన వర్షం దోహదపడనుంది. సకాలంలో సేద్యానికి అనువైన పరిస్థితులు నెలకొనడంతో కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

నేడో, రేపో రుతుపవనాల రాక..

సేద్యానికి అనువైన వర్షపాతం నమోదయ్యేందుకు అవసరమైన రుతుపవనాలు రెండు రోజుల్లో జిల్లాను తాకనున్నట్లు వ్యవసాయ అధికారులు శాఖా అంచనా వేస్తున్నారు. దీని వల్ల వర్షం విస్తృతంగా కురిసి రైతులు దుక్కులు దున్నేందుకు అవకాశం ఏర్పడనుంది. వరి సేద్యానికి ముందు అంతర పంటలైన పిల్లిపెసర, జిలుగు, జనుము పంటలను వేసేందుకు అనువైన వాతావరణం నెలకొంది. ఈ ఏడాది జూన్‌ మాసంలోనే వర్ష సూచనలు నెలకొనడంతో పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.