శుక్రవారం 04 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jun 10, 2020 , 01:34:22

కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి రైల్వే లైన్‌

కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి రైల్వే లైన్‌

  • శరవేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు
  • రూ.1280 కోట్లతో 56 కిలోమీటర్ల మార్గం

సత్తుపల్లి నుంచి కొత్తగూడేనికి జరుగుతున్న బొగ్గు రవాణా ఇక మరింత సులభం కానుంది. కొత్తగూడెం (భద్రాచలంరోడ్‌ రైల్వేస్టేషన్‌) నుంచి సత్తుపల్లి వరకు రైల్వేలైన్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ.1280 కోట్ల వ్యయంతో 56 కిలోమీటర్ల మేర ఈ లైన్‌ నిర్మితమవుతున్నది. ఈ మార్గంలో ఐదు రైల్వేస్టేషన్లు, ఒకజంక్షన్‌ ఏర్పాటుకానున్నాయి. ప్రధానంగా కొత్తగూడెం సమీపంలోని సుజాతనగర్‌ మండల కేంద్రం రేపురేఖలు మారనున్నాయి. 

- కొత్తగూడెం టౌన్

సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ గనుల నుంచి కొత్తగూడేనికి రోడ్డు మార్గం గుండా బొగ్గు రవాణా జరుగుతుండడంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.. ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. బొగ్గు టిప్పర్ల ధాటికి వందలాది మంది క్షతగాత్రులయ్యారు. నిత్యం బొగ్గు, ధూళితో నిండిన లారీలు రోడ్డుపై తిరుగుతుండటంతో ఆ మార్గంలోని ప్రజలు, అటుగా వెళ్లే ప్రయాణికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటి నివారణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఏడేళ్ల క్రితమే రైల్వే లైన్‌ మంజూరైంది. అది నేడు స్వరాష్ట్ర పాలనలో పట్టాలెక్కింది. ఇందులో భాగంగా కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు నూతన రైలు మార్గ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో రోడ్డు మార్గం గుండా సాగే బొగ్గు రవాణా ఇక రైలు మార్గానికి మారనుంది. రహదారి మార్గ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. సింగరేణి, రైల్వే సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సుమారు రూ.1280 కోట్లతో 56 కిలోమీటర్ల మేర ఈ లైన్‌ నిర్మాణమవుతున్నది. ఈ మార్గంలో ఒక రైల్వే జంక్షన్‌తోపాటు ఐదు స్టేషన్లు, 80 వంతెనలు ఉండనున్నాయి. ఎలాంటి రోడ్డు క్రాసింగ్‌లు లేకపోవడం ఈ ట్రాక్‌ ప్రత్యేకత. 

 ఐదు స్టేషన్లు.. ఒక జంక్షన్‌..

ఈ మార్గంలో 3.4వ కిలోమీటర్‌ వద్ద కోయగూడెం సీతంపేట, 22.8వ కిలోమీటర్‌ వద్ద చండ్రుగొండ, 39.25వ కిలోమీటర్‌ వద్ద భవన్నపాలెం, 44వ కిలోమీటర్‌ వద్ద పెనుబల్లి రైల్వేస్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. సత్తుపల్లి రోడ్‌ (లంకపల్లి) మీదుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉపరితల గనులు ఉంటాయి. పెనుబల్లి వద్ద రైల్వే జంక్షన్‌ ఏర్పాటు చేయనున్నారు.

  రవాణా సులభతరం...

సత్తుపల్లిలో ఉన్న జలగం వెంగళరావు ఓపెన్‌ కాస్ట్‌ గని (జేవీఆర్‌ ఓసీ), కిష్టారం ఓసీ, జేవీఆర్‌-2 ఓసీల నుంచి వెలికితీసిన బొగ్గును కొత్తగూడెం మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. ఈ బొగ్గు కొత్తగూడెం చేరుకోవడానికి ప్రస్తుతం రోడ్డు మార్గం ఒక్కటే ఉంది. టిప్పర్ల ద్వారా బొగ్గు రవాణా అవుతుండడంతో నిత్యం అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రైలుమార్గం పూర్తయితే బొగ్గు రవాణా తేలికవుతుంది. సత్తుపల్లి ఓసీ ఏడాదికి 10 మిలియన్‌ టన్నులు, ఓసీ2 మూడు మిలియన్‌ టన్నులు, కిష్టారం ఓసీ రెండు మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతం సగటున రోజుకు 16 వేల టన్నుల బొగ్గును 650 ట్రిప్పుల్లో టిప్పర్లు రవాణా చేస్తున్నాయి. నూతన గనులు ప్రారంభమైతే సుమారు 40 వేల టన్నుల బొగ్గును టిప్పర్ల ద్వారా రవాణా చేయాల్సి ఉంటుంది. దీనికి రవాణా, పర్యావరణ శాఖల నిబంధనలు అంగీకరించవు. అందుకే సింగరేణి, రైల్వే సంస్థలు సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి.

మారనున్న సుజాతనగర్‌ రూపురేఖలు

కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి నూతనంగా నిర్మిస్తున్న రైలు మార్గం కొత్తగూడెం, కోయగూడెం, సీతంపేట, చండ్రుగొండ, భవన్నపాలెం, పెనుబల్లి మీదుగా వెళ్తుంది. చిన్నాచితకా కలిపి సుమారు 80 వంతెనలు నిర్మించేందుకు ఆయా సంస్థలు నివేదికలు సిద్ధం చేశాయి. తల్లాడ - భద్రాచలం రాష్ట్రీయ రహదారిని వేపలగడ్డ వద్ద ఈ రైల్వేలైన్‌ క్రాస్‌ చేయనుంది. దీంతో ఇక్కడ సుమారు రూ.8 కోట్లతో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌వోబీ)ని నిర్మిస్తున్నారు. భారీ క్రేన్ల సాయంతో ఇటీవలే గడ్డర్లను ఎక్కించారు. దీనిని శక్తి ఇంజినీరింగ్‌ ఎక్యూప్‌మెంట్స్‌, కృషి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ రైల్వే ట్రాక్‌ నిర్మాణంతో చెంతనే ఉన్న సుజాతనగర్‌ మండలం రూపురేఖలు మారనున్నాయి.