ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 09, 2020 , 04:51:36

ఇక పంచాయతీకో మరుగుదొడ్డి

ఇక పంచాయతీకో  మరుగుదొడ్డి

  • స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా నిర్మాణం
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం 
  • ఒక్కో నిర్మాణానికి రూ.2 లక్షల నిధులు
  • పారిశుధ్య కమిటీల ఆధ్వర్యంలో నిర్వహణ

గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే అక్కడి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.. ప్రగతి  నిర్ణయాలే గ్రామాలను చైతన్యపరుస్తాయి.. బహిరంగ మల విసర్జన (ఓడీఎఫ్‌) లేని గ్రామాలతోనే ‘స్వచ్ఛభారత్‌'    ధ్యమవుతుంది.. ఈ ప్రాధాన్యాన్ని   గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు    పంచాయతీకో సామాజిక మరుగుదొడ్డి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాయి.. ‘స్వచ్ఛ భారత్‌'లో ఒక్కో నిర్మాణానికి  రూ.2 లక్షల నిధులు      కేటాయించనున్నాయి.. ఉమ్మడి జిల్లాలో త్వరలోనే నిర్మాణాలు ప్రారంభం        కానున్నాయి.. పారిశుధ్య కమిటీలు     పనులను పర్యవేక్షించనున్నాయి..    ప్రభుత్వాల నిర్ణయంపై ప్రజానీకం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

-మామిళ్లగూడెం

మామిళ్లగూడెం: పల్లెప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి పెట్టింది. ప్రధానంగా పారిశుధ్య పనులు చేపట్టి ప్రజలకు మంచి వాతావరణం అందించాలని ముందుకెళ్తున్నది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న స్వచ్ఛభారత్‌ మిషన్‌ను సద్వినియోగం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. దీనిలో భాగంగానే ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో సామాజిక మరుగుదొడ్లు నిర్మించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. బహిరంగ మల, మూత్ర విసర్జనకు స్వస్తి పలికేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి గ్రామంలో మరుగుదొడ్లను నిర్మిస్తున్నాయి. ప్రతి ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మించుకునేలా ప్రజలను చైతన్యం చేశాయి. జిల్లాలో అన్ని గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో ఖమ్మాన్ని ఇప్పటికే బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్‌) జిల్లాగా ప్రకటించారు. ఆ తరువాత కూడా మరుగుదొడ్ల నిర్మాణాలు అవసరం కావడంతో ఆదనంగా మంజూరు చేయించి వాటి నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామాల్లో సామాజిక మరుగుదొడ్లు, మూత్రశాలలు సైతం నిర్మించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. పట్టణ ప్రాంతాల్లో సులభ్‌ కాంప్లెక్సుల తరహాలో ప్రతి గ్రామ పంచాయతీలోనూ వీటిని నిర్మించాలని భావించాయి. నిర్మాణ వ్యయంలో పంచాయతీలు పది శాతం నిధులు మాత్రమే భరించాలని నిబంధలనలు పేర్కొన్నారు.  జిల్లాలోని 20 మండలాల్లోని 584 పంచాయతీల్లో బహిరంగ మల విసర్జనను నిరోధించడానికి వీటిని నిర్మించనున్నారు. వీటి నిర్మాణం అనంతరం ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యపర్చనున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిండంతో నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించారు. 

రూ.2 లక్షలతో నిర్మాణం

ప్రతి గ్రామ పంచాయతీలోనూ సామాజిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2 లక్షల వరకు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 30 శాతం, మిగిలిన 10 శాతం పంచాయతీ భరించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో ఖమ్మం జిల్లాలోని 584 పంచాయతీల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో వీటి నిర్మాణాలు జరుగనున్నాయి. వీటి అవసరాన్ని ఆయా పంచాయతీల పాలకవర్గాలకు పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు వివరిస్తున్నారు. పంచాయతీ కార్యాలయం లేదా బస్టాండ్‌, జన సమూహం ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిలో వీటిని నిర్మించనున్నారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా రెండు చొప్పున మూత్రశాలలు, మరుగుదొడ్లను వేర్వేరుగా నిర్మించనున్నారు. వాటిని నిర్మించుకునేందుకు జిల్లాలో మండల కేంద్రాల పంచాయతీలు, ఇతర మేజర్‌ పంచాయతీలు ఇప్పటికే ఆసక్తి చూపిస్తున్నాయి. నిర్మాణం చేసిన తరువాత గ్రామంలో ఇప్పటికే ఏర్పాటుచేసిన స్థాయీ సంఘాల్లో పారిశుధ్య కమిటికీ వీటి నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు.  

భద్రాద్రి జిల్లాలో..

కొత్తగూడెం : పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పంచాయతీకి సామూహిక మరుగుదొడ్లు (సులభ్‌ కాంప్లెక్స్‌ ) నిర్మించేందుకు కొత్త ప్రణాళిక రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కార్యక్రమానికి త్వరలో శ్రీకా రం చుట్టనున్నారు. జిల్లాలోని 479 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో పంచాయతీ నుంచి రూ.2లక్షలు ఖర్చు చేసేందుకు ప్రణాళిక తయారు చేశారు. పంచాయతీలో ఇంటింటికీ మరుగుదొడ్డి ఉన్నప్పటికీ ఇంకా నిర్మించుకోని వారికి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే వారికి ఈ సులభ్‌ కాంప్లెక్స్‌ ఉపయోగపడనుంది. 

చైతన్య పరుస్తున్నాం..

ప్రతి గ్రామంలోనూ సామాజిక మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ఒక్కో దానికి రూ.2 లక్షల నిధులు కేటాయించింది. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఆదేశాలతో ఆయా గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు  మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించి చైతన్యం చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని పంచాయతీలు ముందుకు వచ్చాయి.

-డీఆర్‌డీవో ప్రవీణ