మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 08, 2020 , 02:41:36

భద్రాచలంలో దర్శనాలు ప్రారంభం

భద్రాచలంలో దర్శనాలు ప్రారంభం

  • కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అనుమతి
  • ఏర్పాట్లను సిద్ధం చేసిన దేవస్థానం

భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం నుంచి భక్తులకు రామయ్య దర్శనభాగ్యం కలగనుంది. లాక్‌డౌన్‌తో 80 రోజులుగా భక్తుల దర్శనాలు నిలిచిపోయిన విషయం విదితమే. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఆలయంలో భక్తుల దర్శనాలకు అవకాశం కల్పించారు. మార్చి 20న రామాలయంలో భక్తుల దర్శనాలు నిలిచిపోయాయి. నిత్య కల్యాణంతో పాటు వివిధ ఆర్జిత సేవలు కూడా నిలిపివేశారు. కొద్దిరోజుల అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో మాత్రమే నిత్య కల్యాణం నిర్వహించారు. అలాగే ఆన్‌లైన్‌లో భక్తులకు సేవలందాయి. ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం కూడా కొద్దిమంది ప్రముఖులు, అర్చకుల మధ్యే ఈసారి నిరాడంబరంగా నిర్వహించారు. ఎప్పుడు భక్తులతో అలరారే భద్రాద్రి భక్తులు లేక వెలవెలబోయింది. దీంతో భద్రాద్రి పుణ్యక్షేత్రంతో పాటు రామాలయ మాడవీధులన్ని నిర్మానుష్యంగా మారాయి. స్థానికంగా వ్యాపారాలు స్తంభించిపోయాయి. దేవస్థానానికి భక్తుల కానుకలే ప్రధాన ఆదాయం. ఈ సొమ్ములతోనే రామాలయం నిర్వహణ ఉద్యోగుల వేతనాల చెల్లింపు జరుగుతాయి. దాదాపు 80 రోజుల పాటు రామాలయంలో భక్తుల దర్శనాలు నిలిచిపోవడంతో సుమారు రూ.2 కోట్లకు పైగానే దేవస్థానానికి నష్టం వాటిల్లింది.  ప్రతి నెల అతికష్టంగా ఆలయ ఉద్యోగులకు దేవస్థానం వేతనాలు ఇస్తూ వచ్చింది.  

తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి

తెలంగాణ  ప్రభుత్వం ఆలయంలో భక్తుల దర్శనం విషయంలో కోవిడ్‌ నియమాలు తప్పక పాటించాలని సూచించింది. ఆలయానికి వచ్చే భక్తుల్లో 65 ఏళ్ల పైబడి ఉన్న వారు, అనారోగ్యంతో ఉన్న వారు, గర్భిణులు, పదేళ్ల లోపు పిల్లలకు ఆలయంలోకి ప్రవేశం లేదు. కరోనా వైరస్‌ లక్షణాలు లేని వారికి మాత్రమే ఆలయంలోకి ప్రవేశించే విధంగా తగు చర్యలు దేవస్థానం చేపట్టనుంది. మాస్కు ధరించిన వారికే మాత్రమే ఆలయంలో అనుమతి. ఆలయానికి చెందిన కోనేరు, పుష్కరిణిల్లో పుణ్యస్నానాలను నిలిపివేశారు. తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలి. ఆలయ  ప్రాంగణంలో శిల్పాలు, విగ్రహాలను తాకకుండా ఉండేలా, ధార్మిక పుస్తకాలు తీసుకొని రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.  

తెరుచుకోనున్న పర్ణశాల దేవాలయం

పర్ణశాల : 80 రోజులుగా మూతపడిన  పర్ణశాల దేవాలయం సోమవారం తెరుచుకోనుంది.  ఈ విషయాన్ని ఆలయ ఇన్‌చార్జి వాసు ధ్రువీకరించారు. నిబంధనలు పాటించే వారినే ఆలయంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు ప్రతిఒక్కరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. ఇదిలా ఉండగా వృద్ధులు, చిన్నారులకు మాత్రం ఆలయ ప్రవేశం లేదన్నారు. దర్శనం కోసం వచ్చిన ప్రతి భక్తునికి థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారని చెప్పారు. ఆలయాల్లోని విగ్రహాలను, హుండీలను తాకకూడదన్నారు.