శనివారం 11 జూలై 2020
Badradri-kothagudem - Jun 07, 2020 , 00:15:42

భద్రాద్రిలో కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

భద్రాద్రిలో కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

భద్రాచలం: కలెక్టర్‌ ఎంవీ రెడ్డి శనివారం భద్రాచలంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఆదర్శనగర్‌ కాలనీని సందర్శించి, అక్కడి పరిస్థితిని పరిశీలించారు. పంచాయతీ పరిధిలో గత, ఈ సంవత్సరం ఖర్చు చేసిన నిధులకు సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆర్డీవో స్వర్ణలతను ఆదేశించారు. డ్రైనేజీల నిర్వహణ సరిగా లేదని, రహదారుల వెంబడి వ్యర్థ్ధాలున్నాయని పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శి బదిలీకి ప్రతిపాదనలు పంపాలని మూడు నెలల క్రితమే డీపీవోకు ఆదేశాలు జారీ చేశామని నేటి వరకు ఎందుకు ప్రతిపాదనలు పంపలేదని అడిగారు. భద్రాచలం ఎంపీడీవో నర్సరీలు ఏర్పాటు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని బదిలీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. భద్రాచలం పట్టణం చాలా ప్రముఖమైందని, ఇంత అపరిశుభ్రంగా ఉంటే ఎలా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. భద్రాచలం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎప్పుడో కార్యాచరణ తయారుచేయాలని, కానీ నేటి వరకు అంకురార్పణ జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో ఆశాలత, ఆర్డీవో స్వర్ణలత, ఎంపీడీవో రవీంద్రనాథ్‌, తహసీల్దారు శేషుకుమార్‌, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. 

గోదావరి వరదల పట్ల ముందస్తు ఏర్పాట్లు చేయాలి..

గోదావరి వరదల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టరు ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం విస్తా కాంప్లెక్స్‌, గోదావరి కరకట్ట, స్నాన ఘట్టాలను కలెక్టర్‌ పరిశీలించారు. గత సంవత్సరం 51.2 అడుగుల వరకు వరద నీరు వచ్చిందని, ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి వరద ఎన్ని అడుగులు వస్తే ఏఏ గ్రామాలు ముంపునకు గురవుతాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. logo