మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 05, 2020 , 01:53:22

కేటీపీఎస్‌ 9వ యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేత

కేటీపీఎస్‌ 9వ యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేత

  • యూనిట్‌లో ప్రారంభమైన ఓవరాల్‌ పనులు 
  • 45 రోజుల పాటు విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం

పాల్వంచ: కేటీపీఎస్‌ 5వ దశ 9వ యూనిట్‌లో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని అధికారులు  గురువారం నిలిపివేశారు. విద్యుత్‌ను నిలిపివేసి ఓవరాల్‌ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. మూడు సంవత్సరాల నుంచి యూనిట్‌లో ఓవరాల్‌ పనులు చేయాలని జెన్‌కో యాజమాన్యం నిర్ణయించినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ప్రతి ఏడాది అన్ని కర్మాగారాల్లో వార్షిక మరమ్మతులు చేస్తుంటారు. అధికారులు విద్యుత్‌ అవసరాలను పరిగణనలోకి తీసుకొని 9వ యూనిట్‌లో ఓవరాల్‌ పనులు చేపట్టకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో యూనిట్‌లో 108 రోజులు నిరాటంకంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ రికార్డు సృష్టించింది. ఎట్టకేలకు సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు యూనిట్‌లోని బాయిలర్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో ఉత్పత్తిని నిలిపివేసి పనులను ప్రారంభించారు. దీంతో జెన్‌కో అధికారులు రూ.70 కోట్ల అంచనా వ్యయంతో  బీహెచ్‌ఈఎల్‌ సంస్థకు పనులు అప్పగించారు. మొత్తం 45 రోజుల పాటు పనులు జరుగనున్నాయని, ఓవరాల్‌ పనులు పూర్తయిన తరువాతనే ఉత్పత్తి చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై టీఎస్‌ జెన్‌కో థర్మల్‌ బాదావత్‌ లక్ష్మయ్యను సంప్రదించగా.. మూడేళ్ల తరువాత ఓవరాల్‌ పనులు చేస్తున్నామని, యూనిట్‌లో బాగా సమస్య ఉన్న యంత్ర పరికరాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి అమర్చేందుకు ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు.