గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jun 05, 2020 , 01:52:17

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

  • 694 ప్రాంతాలను హాట్‌స్పాట్‌గా గుర్తించాలి
  • ‘పది’ విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి పరీక్షలకు అనుమతించాలి
  • వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

కొత్తగూడెం: సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి సీజనల్‌, కరోనా నియంత్రణ, వైద్యశా ఖ లక్ష్యాలు, ప్రజల ఆరోగ్య పరిరక్షణ చర్యలపై వైద్యాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కరోనా నియంత్రణకు వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని కలెక్టర్‌ అభినందించారు. ఉప వైద్యాధికారులు, మెడికల్‌ అధికారులు, ప్రోగ్రాం అధికారులకు కేటాయించిన లక్ష్యాలు, సాధింపులపై సమగ్ర నివేదికలు అందజేయాలన్నారు.

టీకాలు వేయాల్సిన జాబితాలో 1500 మందికి గాను 1300 మంది చిన్నారులకు టీకాలు వేసినట్లు నివేదికలు తయారు చేశారని వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల ద్వారా టీకాల సర్వే నిర్వహిస్తామని, సర్వేలో వ్యత్యాసాలుంటే ఉపేక్షించబోమని చెప్పారు. వ్యాధి నియంత్రణ ముందు జాగ్రత్త చర్యల్లో వైద్యాధికారులు అజాగ్రత్తగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లపల్లి వైద్యాధికారి అశ్వాపురం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావడం, వ్యాధుల నియంత్రణ చర్యలకు రక్తనమూనాలు సేకరణలో అలసత్వం వహించడంపై షోకాజ్‌ నోటీసు జారీ చేసి వివరణ తీసుకోవాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. గత సంవత్సరం జిల్లాలో 604 మలేరియా, 694 డెంగీ కేసులు నమోదైన ప్రాంతాలను హాట్‌ స్పాట్లుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

పది విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి కేంద్రాల్లోకి అనుమతించాలని చెప్పారు. ఏప్రిల్‌ 30 నుంచి నేటి వరకు జిల్లాకు వచ్చిన 2243 మందిని హోం క్వారంటైన్‌ చేసినట్లు చెప్పారు. అనంతరం కరోనా, సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు తీసుకున్న చర్యలను వైద్యాధికారులు పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ అనుదీప్‌, డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్‌, డీసీహెచ్‌ఎస్‌ రమేశ్‌, ఉప వైద్యాధికారులు చేతన్‌, నరేశ్‌, వినోద్‌, శిరీష, వినోద్‌ పాల్గొన్నారు.