శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 04, 2020 , 03:39:33

గొత్తికోయల గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి

గొత్తికోయల గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి

అధికారులతో సమీక్షలో   కలెక్టర్‌ ఎంవీరెడ్డి

కొత్తగూడెం: మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థల అనుభవాలను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో గౌతమ్‌, అటవీశాఖ జిల్లా అధికారి రంజిత్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సమాజానికి, అభివృద్ధికి, నాగరికతకు దూరంగా గొత్తికోయలు నివసిస్తున్నారని, చుంచుపల్లి మండలం జగ్గారంలో పర్యటించి వారి జీవన స్థితిగతులను తాను ఇటీవల పరిశీలించినట్లు చెప్పారు. ఈ కాలంలో కూడా విద్యుత్‌, తాగునీరు, రహదారి సౌకర్యం లేకుండా జీవిస్తున్నారని, వారి జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బడి ఈడున్న పిల్లల కోసం ప్రత్యేకంగా బ్రిడ్జ్‌ పాఠశాలలు ఏర్పాటు చేసి వారి భాషలోనే విద్యాభ్యాసం చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. తల్లీబిడ్డలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు గొత్తికోయ ఆవాసాల్లో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు, ఆయా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. ప్రతి గొత్తికోయ ఆవాసంలో అత్యవసర సమయంలో సమాచారం తెలియజేసేందుకు వీలుగా అధికారుల ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచాలన్నారు. గొత్తికోయ ప్రజలను కమ్యూనిటీ వర్కర్లుగా ఎంపిక చేసి వైద్యంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం అందజేయడంలో కావాల్సిన నిధులపై కార్యాచరణ నివేదిక అందించాలన్నారు. చీకట్లో జీవించాల్సిన అవసరం లేకుండా సోలార్‌ద్వారా విద్యుత్‌ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆధార్‌, రేషన్‌ కార్డులు లేని వారి జాబితా తయారు చేయించాలని ఆర్డీవోను ఆదేశించారు. గిరిజనుల జీవన విధానాన్ని మార్చేందుకు అధికారులకు అవగాహన లేకపోతే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని చెప్పారు.  

గొత్తికోయల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు.. 

సమావేశంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గొత్తికోయల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి పలు అంశాలను వివరించారు. తాగునీటి కోసం ప్రస్తుతం ఉన్న బోర్లను మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలని, అటవీ అనుమతులకు లోబడి ఉపాధి కల్పించేందుకు ఈజీఎస్‌ పనుల నిర్వహణకు జాబ్‌కార్డులు జారీ చేయించాలని సూచించారు. రహదారి సౌకర్యంతో పాటు ఆరోగ్య పరిరక్షణ, అడవుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వ్యవసాయ విధానంలో ఎక్కువ ఉత్పత్తులు సాధించే విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించడం లాంటివి చేయాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తెలియజేశారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ అనుదీప్‌, డీఆర్‌వో అశోక్‌ చక్రవర్తి, డీఆర్‌డీఏ మధుసూదనరాజు, డీఈవో సరోజినీదేవి, డీడబ్ల్యూవో వరలక్ష్మి, డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్‌, డీసీహెచ్‌ఎస్‌ రమేశ్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్‌, జిల్లా ప్రణాళికాధికారి సుబ్బారావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సీతారాం తదితరులు పాల్గొన్నారు.