సోమవారం 06 జూలై 2020
Badradri-kothagudem - Jun 04, 2020 , 03:36:23

ఆదివాసీల ప్రయాణం.. విషాదం

 ఆదివాసీల ప్రయాణం.. విషాదం

  • ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు ఛత్తీస్‌గఢ్‌ మహిళలు మృతి
  • మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.. చర్ల ఆస్పత్రికి తరలింపు
  • తాలిపేరు ప్రాజెక్టు శివారు రాళ్లపురం క్రాస్‌రోడ్డు దగ్గర ఘటన

చర్ల రూరల్‌: నిత్యావసరాలు కొనుక్కుని ట్రాక్టర్‌పై తిరిగి వెళ్తున్న ఆదివాసీల ప్రయాణం విషాదమయమైంది. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడి ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వానకాలం సమీపించడంతో వాగులు, వంకలు పొంగితే అటవీప్రాంత గ్రామాలకు రాకపోకలు ఉండవనే ముందుచూపుతో ఛత్తీస్‌గఢ్‌లోని జీడిమెట్ల ఆదివాసులు

బుధవారం చర్లకు వచ్చి బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు కొనుక్కొని తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌లో 15 మంది ఉన్నట్లు సమాచారం. 30 మూటల ధాన్యం ఇతర సరుకులతో ఆదివాసీల ట్రాక్టర్‌ చర్ల నుంచి బయలుదేరి వెళ్తుండగా తాలిపేరు ప్రాజెక్టు శివారు రాళ్లపురం క్రాస్‌రోడ్డు దగ్గర పల్టీ కొట్టింది. ఈప్రమాదంలో పండా లచ్చమ్మ (50), వెలకం రాధ (34), పండా లక్ష్మి (35) మృతిచెందారు. పండా అందెయ్య, వెలకం బుచ్చయ్య, వెలకం ముత్తయ్య గాయపడగా చికిత్స నిమిత్తం చర్ల ఆసుపత్రికి  తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి బాధితులకు సహాయపడ్డారు. logo